ప్రతి జిల్లాకో గులాబీ భవన్‌

28 Jul, 2018 01:34 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాలకు ప్రభుత్వ భూమి

29 జిల్లా కేంద్రాల్లో గజం రూ.100 చొప్పున కేటాయింపు

గుర్తింపు పొందిన పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను మినహాయింపు

రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం..

రాష్ట్రవ్యాప్తంగా వెంటనే బీసీ గణన ప్రారంభం

గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనకు ఓకే 

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌ : అధికార తెలంగాణ రాష్ట్ర సమితి 29 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించుకునేందుకు ప్రభుత్వ భూములను కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గజం వంద రూపాయల చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా భూములను కేటాయించాలని నిర్ణ యించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు భూములను కేటాయించే విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ప్రకారమే.. టీఆర్‌ఎస్‌ కార్యాలయాల నిర్మాణానికి భూములు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్మించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను మినహాయింపు కల్పించింది. శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ప్రకటించిన పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.
వెంటనే బీసీ జనాభా గణన
గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన బీసీ జనాభా గణన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. గ్రామ పంచా యతీల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నందున గ్రామాల్లో పాలన కోసం ప్రత్యేకాధికారులను నియమించేందుకూ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధి కారులను నియమించాలని నిర్ణయించింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం.. ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియగానే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సంఖ్య 12,751కి పెరగనుంది. ప్రతీ గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ఒక కార్యదర్శి ఉండేలా కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శులను నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం పూర్తికాగానే కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారునున్నాయి. కొత్తగా మనుగడలోకి వచ్చే మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కాలేజీల్లోని ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలు విషయాన్ని పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించేలా, శస్త్రచికిత్సలను చేసేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలివీ..
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు. ఇలాంటి పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు.
గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ప్రకారమే టీఆర్‌ఎస్‌ పార్టీకి 29 జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు.
పదవీకాలం ముగుస్తున్న సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకూ ప్రత్యేకాధికారుల నియామకం.
రాష్ట్రంలో కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో ప్రతీ గ్రామానికీ కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేలా చర్యలు.
రాష్ట్రంలో వెంటనే వెనుకబడిన వర్గాల(బీసీ) జనాభా గణన.
ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం.
2019–20 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున 119 కొత్త బీసీ గురుకులాల ఏర్పాటు. వీటిలో 4,284 మంది సిబ్బంది నియామకం.
గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం.
ప్రతీ నియోజకవర్గానికీ కచ్చితంగా ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే విధానం మేరకు రాష్ట్రంలో కొత్తగా 18 అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు.
రాష్ట్ర పోలీస్‌ శాఖకు కొత్తగా 11,577 వాహనాల కొనుగోలు.
మందుపాతర పేలుడులో మరణించిన మాజీ మంత్రి మాధవరెడ్డి కుటుంబానికి హైదరాబాద్‌లోని షేక్‌పేటలో 600 గజాల ఇంటి స్థలం కేటాయింపు.
భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దులో జరిగిన పోరాటంలో మరణించిన వీర జవాను ఫిరోజ్‌ఖాన్‌ కుటుంబానికి షేక్‌పేటలో 200 గజాల కేటాయింపు.
సూర్యాపేటలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు, సిబ్బంది నియామకం.
జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే అవకాశాల పరిశీలన 

కేబినెట్‌ కీలక నిర్ణయాలు..
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు. ఇలాంటి పార్టీల కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు.
రాష్ట్రంలో కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం. రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో ప్రతీ గ్రామానికీ కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి ఉండేలా చర్యలు.
రాష్ట్రంలో వెంటనే వెనుకబడిన వర్గాల(బీసీ) జనాభా గణన.
ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం.
2019–20 విద్యా సంవత్సరం నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున 119 కొత్త బీసీ గురుకులాల ఏర్పాటు. వీటిలో 4,284 మంది సిబ్బంది నియామకం.
 

మరిన్ని వార్తలు