చార్జీల పెంపునకు సిద్ధం..!

17 May, 2015 03:21 IST|Sakshi
చార్జీల పెంపునకు సిద్ధం..!

 టికెట్ ధరల సవరణపై యాజమాన్యం దృష్టి
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు అడిగిన దానికంటే ఒక శాతం ఎక్కువగా ఫిట్‌మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఇక బస్సు చార్జీల పెంపుపై దృష్టి సారించనుంది. ఫిట్‌మెంట్ భారాన్ని అధిగమించే యత్నాల్లో చార్జీల పెంపు కూడా ఒకటని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అయితే ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా చూస్తామని పేర్కొన్నారు. కానీ, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో ఆర్టీసీపై రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పటికే నష్టంతో కుంగిపోతున్న ఆర్టీసీ ఈ భారం మోయలేమని స్పష్టం చేస్తోంది.  టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిన వెంటనే దాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక భారం నుంచి కొంతైనా తప్పించుకోవాలని చూస్తోంది. కార్మికులకు ఫిట్‌మెంట్ ఇచ్చిన వెంటనే టికెట్ ధరలు పెంచితే.. ఆ భారాన్ని నేరుగా ప్రజలపై మోపిన భావన వస్తుందనే ఉద్దేశంతో చార్జీల పెంపును వెంటనే అమలు చేయొద్దని భావించింది. కానీ, డీజిల్ ధరలు పెరగడంతో ఇక టికెట్ ధరల పెంపు అనివార్యంగా మారింది.
 
 కార్మికులకు ఫిట్‌మెంట్ ప్రకటిస్తే 15 శాతం మేర టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతించాలని ఆర్టీసీ గత నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దానికి వెంటనే పచ్చజెండా ఊపాలని ఇప్పుడు ఆర్టీసీ కోరబోతోంది. దీనికి సంబంధించి మరో రెండుమూడు రోజుల్లో కొత్త ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించే సమయంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీకి పలు వరాలు ప్రకటించారు. అందులో కొన్ని మినహా మిగతా వేటిపై స్పష్టత లేదు. ముఖ్యంగా.. 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటనతో పడే రూ.850 కోట్ల భారాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుందా, ఆర్టీసీకి కొంతమేర గ్రాంట్ల ద్వారా సర్దుబాటు చేస్తుందా అన్న విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేదు.
 
 ఇక ఆర్టీసీకి తీవ్ర భారంగా మారిన రూ.1,900 కోట్ల అప్పుల విషయంలోనూ అలాంటి గందరగోళమే నెలకొంది. అప్పులకు సంబంధించి ఆర్టీసీ రూ.186 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ భారం నుంచి బయటపడాలంటే ముందుగా అప్పులు లేకుండా చేయాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. కానీ, ఆ అప్పులను ఎవరు తీర్చాలనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో ఆర్టీసీకి జరుపుతామన్న కేటాయింపులు ఎంత అనేదీ స్పష్టం కాలేదు. జూన్ నెల నుంచి ఫిట్‌మెంట్‌ను చెల్లించాల్సిన నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ, ముఖ్యమంత్రి హామీల్లో స్పష్టత వస్తేగానీ ఈ లెక్కలు తేలవు. దీంతో ఆర్టీసీ అధికారులు రవాణాశాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రెండుచోట్ల కూడా స్పష్టత లేకపోవడంతో ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదించి చెప్తామనే సమాధానం వచ్చినట్టు తెలిసింది.
 

మరిన్ని వార్తలు