‘గద్వాల’ గులాబీలో వర్గపోరు 

6 Jul, 2019 06:49 IST|Sakshi

మంత్రి సింగిరెడ్డి, ఎమ్మెల్యే బండ్ల మధ్య ముదురుతున్న వివాదం

నియోజకవర్గంలో మంత్రి  ప్రమేయంపై తీవ్ర అసంతృప్తి ?  

సాక్షి, మహబూబ్‌నగర్‌: గద్వాల అధికార టీఆర్‌ఎస్‌ స్వపక్షంలోనే మరో విపక్షం పుట్టికొచ్చిందా? గత కొన్నాళ్లుగా స్థానిక ఎమెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. మంత్రి నిరంజన్‌రెడ్డి మధ్య సాగుతోన్న వర్గపోరు తారా స్థాయికి చేరుకుందా? అవుననే అంటున్నాయి టీఆర్‌ఎస్‌ వర్గాలు. గద్వాలలో మంత్రి ప్రమేయం పెరిగిందని, స్థానికంగా ఆయనకు అనుకూలంగా మరో వర్గాన్ని తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే సైతం అనూహ్యంగా తన వ్యక్తిగత భద్రత సిబ్బందిని ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే వ్యక్తిగత కారణాలతోనే భద్రత సిబ్బందిని ఉపసంహరించుకున్నానని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ మంత్రి ప్రమేయమే కారణమని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఇటీవల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులందరూ ఓ చోట సమావేశమై.. విందు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే కలత చెందారని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందుకే తన అంగరక్షకులను ఉపసంహరించుకున్నారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గద్వాల టీఆర్‌ఎస్‌లో కొనసాగుతోన్న వర్గపోరు అధిష్టానం దృష్టికి వెళ్లింది. పరిస్థితి ఇలానే ఉంటే దాని ప్రభావం త్వరలోనే జరగనున్న ‘పుర’ పోరు ఫలితాలపై పడుతుందని భావించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అంగరక్షకులను ఉపసంహరించుకున్న విషయం తెలుసుకున్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం ఎమ్మెల్యేకు ఫోన్‌ చేశారు. వెంటనే హైదరాబాద్‌కు రావాలని ఆదేశించడంతో ఆయన హుటాహుటీనా బయల్దేరి వెళ్లారు.  

వర్గపోరే కారణామా? 
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలోనే రెండు వర్గాలుగా విడిపోయింది బహిరంగ రహస్యమే. 2014 ఎన్నికల్లో గెలిచిన కృష్ణారావు మంత్రిగా ఉన్న సమయంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉన్నారు. దీంతో బండ్లకు కృష్ణారావు వర్గీయుడిగా పేరు పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయారు. అదే సమయంలో వనపర్తి నుంచి గెలిచిన నిరంజన్‌రెడ్డికి అనూహ్యంగా వ్యవసాయశాఖ మంత్రి దక్కింది.

దీంతో మంత్రి నిరంజన్‌రెడ్డి.. జూపల్లిపై ఉన్న వ్యతిరేకతతోనే.. ఆయన వర్గీయుడైన బండ్లకు ప్రత్యామ్నాయంగా గద్వాలలో మరో వర్గాన్ని తయారు చేస్తున్నారనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో సాగుతోంది. ఫలితంగా గత వారం జిల్లాకేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు మంత్రి నిరంజన్‌రెడ్డి రావడంపై ఎమ్మెల్యే అయిష్టత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో మంత్రి కూడా కనీసం అరగంట కూడా గద్వాలలో గడపలేదు. మరోపక్క.. మంత్రి గద్వాలలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నూతన జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితకు, ఆమె వర్గానికి మంత్రి నిరంజన్‌రెడ్డి అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

మరిన్ని వార్తలు