కారులోకి కాంగ్రెస్‌!

19 Apr, 2019 05:25 IST|Sakshi

తుది దశకు సీఎల్పీ విలీన ప్రక్రియ

అసెంబ్లీ భేటీకి ముందే పూర్తి!

టీఆర్‌ఎస్‌లోకి మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

మరో ఇద్దరు చేరితే సీఎల్పీ విలీనమే

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో పూర్తి ఆధిపత్యం లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వేగం పెంచింది. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని విలీనం చేసే ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరికకు సైతం రంగం సిద్ధమైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల్లోపే కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిసింది. గతంలో టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేసిన ఈ ఎమ్మెల్యే త్వరలోనే పార్టీలో చేరే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కోసం 2 రోజుల క్రితం ఈ ఎమ్మెల్యే నియోజకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ సమావేశాన్ని రద్దు చేశారు.

పార్టీ మార్పు అంశం కారణంగానే సమావేశం రద్దయినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. రెండుమూడు రోజుల్లోనే ఈ ఎమ్మెల్యే చేరికపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లోని ఒక్కరు చొప్పున ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే అధికార పార్టీలోకి మారే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోపే మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరిక ఉంటుందని అంటున్నారు. మున్సిపల్, రెవెన్యూ కొత్త చట్టాలను ఆమోదించేందుకు ప్రత్యేకంగా నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లోపే టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష విలీనం ప్రక్రియ ముగుస్తుందని అధికార పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.  

శాసనసభాపక్షం విలీనం... 
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీనమైనట్లుగా గుర్తిస్తారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, బానోతు హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు, జాజుల సురేందర్‌లు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని, కాంగ్రెస్‌ను వీడితున్నామని తెలిపారు.

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇదే బాటలో నడిస్తే టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీనం అమలు వ్యూహం పూర్తికానుంది. అసెంబ్లీ సమావేశాల్లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందనే ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉంది. ఒకవేళ ఏమైనా కారణాలతో అప్పటికీ పూర్తికాకపోతే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పూర్తవుతుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఏమాత్రం లేవని.. ఫలితాల్లో ఈ విషయం స్పష్టత వచ్చి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది.

మరిన్ని వార్తలు