1 టు 100

30 Nov, 2018 00:32 IST|Sakshi

వంద సీట్లలో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం 

2001లో ఒక్క సీటుతో ప్రస్థానం మొదలు... 

ముందస్తులో భారీ లక్ష్యంతో కేసీఆర్‌ ప్రయాణం 

ఒక్క ‘సీటు’తో బయల్దేరిన కారు.. ప్రస్తుతం వంద సీట్ల సాధన దిశగా సాగుతోంది. వేల మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుందనే స్ఫూర్తితో ఉద్యమ నేపథ్యం నుంచి పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క సీటుతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ముందస్తు ఎన్నికలలో వంద సీట్లలో గెలుపును లక్ష్యంగా పెట్టుకుంది. రికార్డు స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారం చేపట్టాలనే లక్ష్యంగా కూటమితో తలపడుతోంది. నాలుగేళ్ల మూడు నెలల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తోంది. ముందస్తు ఎన్నికల్లో వంద సీట్లు సాధించడం ఖాయమని గులాబీ దళపతి కేసీఆర్‌ ధీమాగా చెబుతున్నారు. ఆ మేరకు అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు. వంద అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.  69 సెగ్మెంట్లలో పూర్తి చేశారు.
 
లక్ష్యం కోసం... 
కె.చంద్రశేఖరరావు 2001 ఏప్రిల్‌ 21న టీడీపీకి, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి, సిద్ధిపేట ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. ప్రత్యేక రాష్ట్రం సాధనలో ఉద్యమ నాయకుడిగా ముందున్నారు. అదే ఏడాది సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను చాటే విషయంలో ఎన్నికలనే సాధనంగా చేసుకుని వ్యూహం రచించారు. ఎన్నికలలో కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా ఆగిపోలేదు.  

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ప్రజల తీర్పుతో తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 2001తో పాటు అన్ని ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేసింది. ఒక్క 2008 ఉప ఎన్నికలు మినహా అన్నిసార్లు అన్ని స్థానాల్లోనూ గెలిచింది. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్నికల రాజకీయంలో టీఆర్‌ఎస్‌కు ఒంటరి పోరే కలిసి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఒంటరిగా  63 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచింది.
- పిన్నింటి గోపాల్‌ 

>
మరిన్ని వార్తలు