ఊళ్లపై గులాబీ జెండా

31 Jan, 2019 04:26 IST|Sakshi

పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే హవా

8,264 పంచాయతీల్లో అధికార పార్టీ మద్దతుదారుల విజయం

కాంగ్రెస్‌కు 2,688..బీజేపీకి 170.. టీడీపీకి 77 స్థానాలు

1,371 పంచాయతీల్లోస్వతంత్రుల పాగా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగిసింది. గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగిరింది. మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు అధికార పార్టీకే పట్టం కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 12,730 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. వివిధ కారణాలతో 47 పంచాయతీల్లో పోలింగ్‌ నిలిచిపోయింది. రిజర్వేషన్ల కారణంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 23 పంచాయతీల్లో ఎన్నికలు కోర్టు కేసులతో వాయిదా పడ్డాయి.

ఫలితంగా 12,683 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 8,264 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. 2,688 చోట్ల కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందారు. ఇక భారతీయ జనతాపార్టీ 170, తెలుగుదేశం పార్టీ 77, సీపీఐ 39, సీపీఎం 74 పంచాయతీలు కైవసం చేసుకోగా.. 1,371 పంచాయతీల్లో స్వతంత్రులు పాగా వేశారు. 

మూడో విడతలో 88.03% పోలింగ్‌...
చివరి విడతగా బుధవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 88.03% పోలింగ్‌ నమోదైంది. మూడోవిడతలో మొత్తం 4,116 పంచాయతీలకు గాను 4,083 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటి పరిధిలో 45.23లక్షల మంది ఓటర్లుండగా.. 39.82 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసిన వారిలో మహిళలు 20.14 లక్షలు, పురుషులు 19.68 లక్షల మంది ఉన్నారు. యాదాద్రి–భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.99% పోలింగ్‌ నమోదైంది. 94.56 శాతం పోలింగ్‌తో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉండగా.. సూర్యాపేట (92.6%), నల్లడొండ (91.73%), మహబూబాబాద్‌ (91.54%), సిద్ధిపేట (90.73%), మెదక్‌ (90.28%), సంగారెడ్డి (90.15%) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 77.7% పోలింగ్‌ జరిగింది. కాగా మేడ్చల్‌ జిల్లాలో మూడో దశ పోలింగ్‌ జరగలేదు. 


 

మరిన్ని వార్తలు