‘టీచర్‌’కు టీఆర్‌ఎస్‌ బీ ఫారం లేదు

1 Mar, 2019 03:51 IST|Sakshi

ఉపాధ్యాయ ఎమ్మెల్సీఎన్నికల్లో మారిన వ్యూహం

గ్రాడ్యుయేట్‌ స్థానంపై తేలని వైఖరి

మార్చి 5 నామినేషన్‌ దాఖలుకు గడువు

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అధికారికంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని బరిలో దించకూడదని నిర్ణయిం చింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్, మెదక్, ఆది లాబాద్, నిజామాబాద్‌; వరంగల్, ఖమ్మం, నల్లగొం డ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 5న నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 22న పోలింగ్, 26న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.

2013 లో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పాతూరి సుధాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్‌ విజయం సాధించారు. అనంతరం రవీందర్‌ టీఆర్‌ఎస్‌ అనుబంధ సభ్యుడిగా మారారు. వీరి పదవీకాలం మార్చి 29తో ముగుస్తోంది. దీంతో ఈ రెండు సెగ్మెంట్లకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు కావడంతో వీరిద్దరికీ మరోసారి అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం మొదట భావించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాన్ని మార్చింది. 

రాజకీయాలు దూరం...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సం ఘాల ప్రతినిధులు పోటీ చేయడం ఆనవాయితీ. ఇప్పుడూ ఇదే పరిస్థితి ఉంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 13 మం ది పోటీ చేసే అవకాశముంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఆరుగురు బరిలో నిలవనున్నారు. వీరంద రూ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులే కావడంతో ఈ ఎన్నికల్లో అధికారికంగా పోటీ చేయకుండా దూరంగా ఉండటమే సమంజసమని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన వాదాన్ని ఉపాధ్యాయ వర్గాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అప్పుడు టీఆర్‌ఎస్‌ పోటీ చేసింది. ఆ అవసరం ఇప్పుడు లేనందున ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉండడమే సరైన నిర్ణయమని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో రెండు ఉపాధ్యాయ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను బరిలో దించకూడదని నిర్ణయించింది. 

పట్టభద్రులు ఇలాగేనా...
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం ఎన్నిక జరుగుతోంది. శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పదవీకాలం మార్చి 29తో ముగుస్తోంది. దీంతో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతోపాటే ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ తరపున అభ్యర్థిని బరిలో దించే విషయంలో తుది నిర్ణయానికి రాలేదు.

నేడు పాతూరి నామినేషన్‌
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారికం గా అభ్యర్థిని పోటీలో నిలిపే ఉద్దేశంలో లేకపోవడంతో పాతూరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 22,447 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 15 కొత్త జిల్లాలు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు