మిగతా డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలి: కేశవరావు

14 Oct, 2019 09:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని... ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపజాలదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె.కేశవరావు అన్నారు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని కోరారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందని.. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని పేర్కొన్నారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని వ్యాఖ్యానించారు. 

అదే విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేశవరావు విఙ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నానని.. ఇందుకు ఆయనను అభినందిసస్తున్నాని ఆయన పేర్కొన్నారు. ఇక అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజీ క్యారేజీల విషయంలో కేసీఆర్‌ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కేశవరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందంటూ ఆవేదన చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు