ఆస్తి తగాదాలతో టీఆర్‌ఎస్‌ నేత హత్య

5 Jul, 2020 11:47 IST|Sakshi
పోలేపల్లిలో లాఠీచార్జ్‌ చేస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో మృతుడు లాలూనాయక్‌ (ఫైల్‌)

సాక్షి, దేవరకొండ : కుటుంబ ఆస్తి తగాదాలు చిలికి.. చిలికి గాలివానగా మారి ఒకరి ప్రాణాన్ని బలిగొంది.. మృతుడు టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు. చందంపేట మండలంలో శని వారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పాత పోలేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ గోప్యానాయక్‌ కుటుంబానికి చందంపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లాలునాయక్‌ (50) కుటుంబానికి కొంత కాలంగా ఆస్తి పంచాయితీ నడుస్తోంది.

ఈ విషయమై పలుమార్లు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. లాలునాయక్‌ కుమార్తె రమావత్‌ పవిత్ర ప్రస్తుతం చందంపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద బస్‌షెల్టర్‌ను ఆక్రమించుకొని రోడ్డు వెంట ఏర్పాటు చేసిన దుకాణాలను శనివారం ఆర్‌అండ్‌బీ పోలీస్‌శాఖ సంయుక్తంగా తొలగించడం ప్రారంభించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న గోప్యానాయక్‌ కుమారుడు విజయ్‌నాయక్, లాలునాయక్‌లు తారసపడడంతో మాటమాట పెరిగి ఆస్తి విషయమై తగాదా పడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అక్కడినుంచి బిల్డింగ్‌తండా గ్రామానికి వెళ్లిన ఇరు వర్గీయులు మరోసారి ఘర్షణ పడ్డారు.

ఈ క్రమంలో మారణాయుధాలతో దాడి చేయడంతో లాలునాయక్‌ తలకు తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అతన్ని దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. లాలు నాయక్‌ మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని వర్గీయులు విజయ్‌నాయక్‌ ఇంటిపై దాడికి దిగి సామగ్రిని ధ్వంసం చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలేపల్లి, బిల్డింగ్‌తండాలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో పికెట్‌ ఏర్పాటుచేసినట్లు ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ తెలి పారు. శాంతిద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  
 

మరిన్ని వార్తలు