ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ

4 May, 2016 15:47 IST|Sakshi
  • అధికార పార్టీ నాయకుడి నిర్వాకం
  • కలెక్టరేట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వంచన
  • నిరుద్యోగుల నుంచి రూ.20 లక్షలు వసూలు
  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

  • మోర్తాడ్‌:
    నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రూ.20 లక్షలకు టోకరా వేశాడో వ్యక్తి. కలెక్టరేట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేసిన అధికార పార్టీ నాయకుడు ఆ తర్వాత తప్పించుకు తిరుగుతున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లంచం అడిగితే నేరుగా తన కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఓ పక్క పేర్కొంటుంటే, అదే పార్టీకి చెందిన నాయకుడు మరోపక్క అవినీతికి తెరలేపాడు. కలెక్టరేట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మండలంలోని శెట్‌పల్లికి చెందిన ఐదుగురు నిరుద్యోగులకు నమ్మబలికాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు వసూలు చేశాడు.

    ఇది జరిగి దాదాపు ఏడాది కావొస్తోంది. ఉద్యోగాలు ఇప్పించాలని సదరు బాధితులు ఏడాది నుంచి ఆ నాయకుడి చుట్టూ తిరుగుతున్నారు. వారం, పదిహేను రోజులు అంటూ వాయిదా పెడుతూ వస్తుండడంతో, విసిగిపోయిన నిరుద్యోగులు ఇటీవల గట్టిగా నిలదీయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. పదిహేను రోజుల్లో పని పూర్తి చేస్తానని ఆ నాయకుడు వారికి చెప్పాడు. కానీ, ఆ గడువు కూడా ముగిసిపోయింది. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో అప్పు చేసి మరీ డబ్బు చెల్లించిన నిరుద్యోగులు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు.

    తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడే తమను వంచించడంతో ఎవరికీ ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. మరోవైపు, కలెక్టరేట్‌లో కొలువుల గురించి బాధితులు ఆరా తీయగా, అసలు ఉద్యోగాలే లేవని వెల్లడైంది. దీంతో తాము చెల్లించిన డబ్బు రాబట్టుకొనేందుకు వారు సదరు నాయకుడు చుట్టూ తిరుగుతున్నారు.

>
మరిన్ని వార్తలు