వికలాంగ ధ్రువపత్రం లేకుండానే..

17 Jul, 2015 01:59 IST|Sakshi
వికలాంగ ధ్రువపత్రం లేకుండానే..

 సంగారెడ్డి మున్సిపాలిటీ : ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో అధికారులు తమ చేతివాటం చాటుకుంటున్నారు. అవకాశం వస్తే చాలు తమ అనుయాయులకు కావాల్సిన చోటు ఇచ్చేస్తున్నారు. ఇందుకు గురువారం నిర్వహించిన వికలాంగత్వం(పీహెచ్‌సీ) ఉపాధ్యాయుల బదిలీల్లో అవినీతి స్పష్టంగా కనిపించింది. ఎలాంటి వికలాంగ ధ్రువపత్రంలేని ఉపాధ్యాయురాలికి కావాల్సిన చోటకు బదిలీ చేశారు. ఆమె కంటే ఒక పాయింట్ తక్కువగా ఉన్న ఉపాధ్యాయురాలు అధికారులను నిలదీయడంతో విషయం బయట పడింది. దీంతో అధికారులు పీహెచ్‌సీ సర్టిఫికెట్ లేకుండానే బదిలీకి ఎలా అవకాశం ఇస్తారని నిలదీయగా వారం రోజుల్లో సర్టిఫికెట్ అందజేస్తామని అఫిడవిట్ ఇవ్వడం వల్లనే అవకాశం ఇచ్చినట్లుగా తెలిపారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ సమయంలో కావాల్సిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నప్పుడే బదిలీ చేసేందుకు అర్హత ఉంటుంది. కానీ మామూళ్లకు లొంగి ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  

  హాల్‌లో టీఆర్‌ఎస్ నాయకుడు
 ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ హాల్‌లోకి ఉపాధ్యాయ సంఘాల నాయకులను అనుమతించేది లేదని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. కానీ ఆ శాఖ ప్రధాన అధికారి సమక్షంలోనే టీఆర్‌ఎస్ నాయకుడు వేదికపై ఉండటం గమనార్హం. గురువారం గాంధీసెయింటనరీ హైస్కూల్ లో ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా కల్హేర్ జెడ్పీటిసీ సభ్యురాలు స్వప్న భర్త మోహన్ హాలులోకి వచ్చి అధికారులతో సమానంగా నిలబడి ఉన్నాడు. ఇదే సమయంలో హాల్‌లోకి వచ్చిన డీఈవో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎవరైనా ఉన్నారా... అంటూ ప్రశ్నించారు కానీ.. తన పక్కన ఉన్న టీఆర్‌ఎస్ నాయకుణ్ని మాత్రం ఎందుకున్నావు అని ప్రశ్నించలేకపోయారు.

 నేడు ఎస్జీటీలకు...
 ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్‌ను శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నిర్విహ స్తున్నట్లు డీఈవో రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు సెయింట్ ఆంథోని హైస్కూల్‌లో తెలుగు భాష పండితులకు, మధ్యాహ్నం 3 గంటలకు హిందీ భాష పండితులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు  తెలిపారు.

మరిన్ని వార్తలు