ఎన్నికల్లో ఓడించాడని టీఆర్‌ఎస్‌ నేత హత్య

20 Sep, 2019 08:55 IST|Sakshi
బ్రహ్మళకుంట హత్యకేసు నిందితులను చూపుతున్న కల్లూరు ఏసీపీ వెంకటేష్‌

ఏటుకూరి నరసింహారావు హత్య  కేసును ఛేదించిన పోలీసులు

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సంచలనం సృష్టించిన బ్రహ్మళకుంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ కక్షలతోనే ఏటుకూరి నరసింహారావును అదే గ్రామానికి చెందిన వ్యక్తులు హతమార్చినట్లు కల్లూరు ఏసీపీ ఎన్‌ వెంకటేష్‌ తెలిపారు. ఈ హత్యకు సంబంధించి గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్‌ 10న బ్రహ్మళకుంటకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు ఏటుకూరి నరసింహారావు(50) వ్యక్తిగత పనులపై వెళ్లి తాళ్ళపెంట వైపు నుంచి బ్రహ్మళకుంట ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యలో మరో ద్విచక్రవాహనంపై నిందితులు బాణోతు గోపి, బాణోతు వెంకటేశ్వరరావు వచ్చి కర్రలతో కొట్టి హతమార్చారు.

గత జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వకుండా తమ ఓటమికి నరసింహారావు కారణమని భావించి, బాణోతు బీమా కుటుంబ సభ్యులు నరసింహారావు ఇంటికి వెళ్లి మాకు మద్దతు ఇస్తానని చెప్పి మోసం చేశావని, తమకు రూ.30 లక్షలు ఎన్నికల ఖర్చు అయ్యిందని, ఆ డబ్బు పోవడానికి, ఓడిపోవడానికి కారణం తననేనంటూ నరసింహారావును ఇంటి వద్దే తిట్టి బెదిరించారు. ఈ విషయం పోలీసుస్టేషన్‌ వరకు వెళ్లినప్పటికీ ఇరు వర్గాలు రాజీ పడ్డారు. పంచాయతీ వ్యవహారాల్లో నరసింహారావు, ప్రస్తుత సర్పంచ్‌తో కలిసి పనిచేస్తుండటంతో బీమా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. నరసింహారావును హతమార్చాలని, అతని స్నేహితులు బాణోతు వెంకటేశ్వరరావు, అజ్మీర రవీంద్ర, బాణోతు కృష్ణ, సోదరుడు బాణోతు మోహన్, తండ్రి బాణోతు బీమా మాట్లాడుకుని పథకం రూపొందించారు.
 
ఒంటరిగా వస్తుండటంతో.. 
సెప్టెంబర్‌ 10న ఒంటరిగా కొత్తూరు నుంచి బ్రహ్మళకుంట ఇంటికి తిరిగి వస్తున్న నరసింహారావును గోపి కర్రతో వెనుక నుంచి తలపై కొట్టాడు. దీంతో నరసింహారావు బండిపై నుంచి కింద పడి, తనను ఏం చేయవద్దని బతిమిలాడినప్పటికీ గోపితో పాటు అతని మిత్రుడు వెంకటేశ్వరరావు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టి, నరసింహారావు మృతి చెందాడని నిర్ధారించుకున్నాకా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ముగ్గులపోటీ వద్ద ప్రత్యక్షం.
నరసింహారావును హతమార్చిన గోపి, వెంకటేశ్వరరావు ఇళ్లకు వెళ్లి బట్టలు మార్చుకుని ఏమీ తెలియనట్లు గ్రామంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ వద్దకు వెళ్లి కొంతసేపు గడిపారు. తరువాత పోలీసుల రంగ ప్రవేశంతో కనిపించకుండాపోయారు. సీఐ రవికుమార్, ఎస్‌ఐ తోట నాగరాజు, ట్రైనీ ఎస్‌ఐ ఏ శ్రీకాంత్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నరసింహారావుది హత్యగా ప్రాథమింగా నిర్ధారించి, విచారణ చేపట్టారు. ఈ విచారణలో నరసింహారావు హత్యలో మొత్తం ఆరుగురు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు పోలీసుల నిగ్గుతేల్చినట్లు ఏసీపీ వెంకటేష్‌ తెలిపారు. ప్రధాన నిందితుడిగా బ్రహ్మళకుంట బాణోతు గోపి, ఏ2గా బాణోతు వెంకటేశ్వరరావు, ఏ3 బాణోతు బీమా, ఏ4 బాణోతు మోహన్, ఏ5 అజ్మీర రవీంద్ర, ఏ6 బాణోతు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాణోతు వెంకటేశ్వరరావు సోదరి వాంకుడోతు మంగ్గమ్మపై సైతం సాక్ష్యాధారాలు మాయం చేసినందుకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఆరుగురు నిందితులను గురువారం సత్తుపల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. హత్య కేసును చేధించిన సీఐ రవికుమార్‌ను, ఎస్‌ఐ తోట నాగరాజు, ట్రైనీ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను అభినందించారు.
 
గ్రామంలో పికెటింగ్‌ ఏర్పాటు.. 
బ్రహ్మళకుంట గ్రామంలో రాబోయే రోజుల్లో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు