హోం మంత్రిగా మహమూద్‌ అలీ 

14 Dec, 2018 02:21 IST|Sakshi

మిగిలిన మంత్రుల శాఖల్లో మార్పులు! 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా మహమూద్‌ అలీని నియమిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం కేసీఆర్‌తోపాటు మంత్రిగా మహమూద్‌ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. మహమూద్‌ అలీ నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జీవోలో ఉప ముఖ్యమంత్రి అని పేర్కొనలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండకపోవచ్చని తెలిసింది. మహమూద్‌ అలీ గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వహించారు. తాజా బాధ్యతలతో.. తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను చేపట్టిన తొలి ముస్లిం నేతగా గుర్తింపు పొందారు. అలీ శాఖ మారిన నేపథ్యంలో గత ప్రభుత్వంలోని మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. 

పాల వ్యాపారం నుంచి.. 
హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన మహమూద్‌ అలీ 1953 మార్చి 2న జన్మించారు. ఆయన తండ్రిపేరు పీర్‌ మహ్మద్‌ బాబూమియా, తల్లి సయీదున్నీసా బేగం. భార్యపేరు నస్రీన్‌ ఫాతిమా. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు (ఫిర్దోస్‌ ఫాతిమా, అఫ్రోజ్‌ ఫాతిమా), కుమారుడు మహ్మద్‌ ఆజం అలీ. బీకాం వరకు చదివిన ఆయన పాల వ్యాపారం చేశారు. మలక్‌పేట ప్రాంతం నుంచి చురుకైన మైనారిటీ నేతగా ఆయనకు మంచి పేరుంది. ఇంటర్మీడియట్‌ చదివే రోజుల నుంచే మహమూద్‌ అలీ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ అవిర్భావం నుంచి కేసీఆర్‌ వెంటే ఉన్నారు. 2001లో టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆ తర్వాత హైదరాబాద్‌ నగర టీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా.. 2005, 2007లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో టీఆర్‌ఎస్‌ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మహమూద్‌ అలీ గురువారం మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. కీలకమైన హోం శాఖ బాధ్యతలను అప్పగించారు. 

మరిన్ని వార్తలు