చల్లగా జారుకున్నాడు

6 Dec, 2015 03:23 IST|Sakshi
చల్లగా జారుకున్నాడు

మీకు మాకు పోటీ ఎందుకులే...మీకు బలం ఉన్న మూడు చోట్ల మీకే మద్దతు ఇస్తే పోయేదేముందంటూ సీనియర్ కాంగ్రెస్ నేత చెవిలో ఎంచక్కా పూవు పెట్టాడో పార్లమెంట్ సభ్యుడు. టీఆర్‌ఎస్ వ్యవహారాల్లో అధినేత కేసీఆర్ తన మాటకు గౌరవం ఇస్తారని చెప్పుకునే సదరు నేత ఈ మధ్య కాంగ్రెస్ ముఖ్య నేత ఒకాయనతో ప్రైవేట్ విందులో కలిసి పాల్గొన్నారు. సహజంగానే స్థానిక సంస్థల నుంచి జరగనున్న ఎన్నికల వ్యవహారం అక్కడ చర్చకు వచ్చింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానిక సంస్థల సభ్యులు ఉన్నారని, తేలిగ్గా నాలుగు గెలుచుకుంటామని కాంగ్రెస్ ముఖ్య నేత ధీమాగా చెప్పారు.

అబ్బే వరంగల్‌లో ఏమైందో చూశారుగా...ఇప్పుడు కూడా అంతే...అందువల్ల మీరో మూడు సీట్లు తీసుకోండి...మిగిలిన చోట్ల మేము పోటీ చేస్తాం...తేలిగ్గా అయిపోతుందన్నాడు. దీనిపై కేసీఆర్‌తో చర్చిస్తానని కూడా నమ్మబలికాడు. మూడు సీట్లలో తేలిగ్గా గెలవొచ్చుకదా... ఇదేదో బాగుందని సదరు కాంగ్రెస్ ముఖ్యనేత విషయాన్ని పార్టీ సీనియర్ల చెవిలో పడేశారు. ఆ నోటా ఈ నోటా విషయం బయటకు పొక్కింది. అంతే అధికారపక్షంతో పొత్తా... ఇంకేమైనా ఉందా అంటూ ఈ వ్యవహారం మింగుడుపడని సీనియర్లు గగ్గోలు పెట్టారు. పార్టీని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఇష్యూ ఢిల్లీ దాకా వెళ్లింది...కానీ, కేసీఆర్ మాత్రం కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న నల్లగొండలోనే తొలి అభ్యర్థిని ప్రకటించేసరికి ముందు ప్రతిపాదించిన ఎంపీ గారు ఇప్పుడు ఫోన్ కూడా తీయడం లేదట.
 

మరిన్ని వార్తలు