కారు ఎందుకు దిగుతున్నారు?

20 Sep, 2018 09:44 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి అసంతృప్త నేతల నుంచి సెగ తాకుతోంది. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే ఉమ్మడి పాలమూరులోని 14 అసెంబ్లీ స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. అయితే ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు చోట్ల అసంతృప్తులు భగ్గుమన్నారు. కల్వకుర్తి, అలంపూర్, గద్వాల, మక్తల్, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో అసంతృప్తనేతలు ఆందోళనలు, ప్రత్యేక సమావేశాలు చేపట్టారు.

దీంతో ముఖ్యనేతలు రంగప్రవేశం చేసి అసంతృప్తులను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, ఒక మక్తల్‌ నియోజకవర్గంలోని అసంతృప్త నేతలను ఇప్పటివరకు ముఖ్యనేతలు పిలిచి మాట్లాడకపోవడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా గళాలు రోజురోజుకు పెరుగుతుండడంపై ఆయన అనుచరులు అనుమాలు వ్యక్తం చేస్తున్నారు. చిట్టెంపై కుట్ర జరుగుతోందని వారు మండిపడుతున్నారు. దీంతో మక్తల్‌ రాజకీయ వ్యవహారం ఎటు దారి తీస్తుందోననేది చర్చనీయాంశంగా మారింది.

సముదాయించిన నేతలు 
రానున్న ఎన్నికల్లో బరిలో నిలవాలని ఆశించిన భంగపడిన వారిని ముఖ్యనేతలు రంగంలోకి దిగి సముదాయిస్తున్నారు. కల్వకుర్తిలో టిక్కెట్టు ఆశించి దక్కకపోవడంతో ఏకంగా బాలాజీసింగ్‌ అనుచరులు ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్‌ దిష్టిబొమ్మనే దగ్ధం చేశారు. అలాగే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయాణరెడ్డి అనుచరులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కల్వకుర్తిలో పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు సహకరించాలంటూ ఏకంగా మంత్రి కేటీఆర్‌ బుజ్జగించారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఎమ్మెల్సీ కసిరెడ్డితో పాటు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్‌ విజితారెడ్డి తదితరులను మంత్రి కేటీఆర్‌ వద్దకు తీసుకెళ్లి సముదాయించారు.

అలాగే అలంపూర్, గద్వాల నియోజకవర్గాలలో నెలకొన్న పరిస్థితిని మంత్రి హరీశ్‌రావు సరిదిద్దారు. అలంపూర్‌లో మాజీ ఎంపీ మందా జగన్నాథం, అతని కుమారుడు మందా శ్రీనాథ్‌ను పిలిపించి భవిష్యత్‌లో పార్టీ మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే గద్వాల నియోజకవర్గానికి సంబంధించి గట్టు తిమ్మప్ప, బక్క చంద్రన్న, ఆంజనేయులు గౌడ్‌ వంటి నేతలను మంత్రి హరీశ్‌రావు పిలిపించుకుని పార్టీ అభ్యర్థి బండ్ల చంద్రశేఖర్‌రెడ్డికి సహకరించాలని సూచించారు. ఇలా మొత్తం మీద ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్త జ్వాలలు కాస్త సద్దుమణిగాయి.
 
మక్తల్‌ విషయంలో కాస్త భిన్నం 
ఉమ్మడి జిల్లాలోని అసంతృప్తులను సముదాయించిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు.. మక్తల్‌ విషయం లో కాస్త భిన్నంగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మక్తల్‌లో టీఆ ర్‌ఎస్‌ నేతలు కాంట్రాక్టర్‌ జలంధర్‌రెడ్డి, నేతలు రాజుల ఆశిరెడ్డి, గవినోళ్ల గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గంగాధర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి నలుగురు కుమారులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఆత్మగౌరవ నినాదం పేరిట ప్రతీ మండల కేంద్రాల్లో సభలు నిర్వహిస్తున్నారు. టికెట్‌ ప్రకటన వచ్చిన నాటి నుంచి బుధవారం వరకు కూడా రోజుకో చోట ఈ సభలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గతంలో వీరిని మంత్రి కేటీఆర్‌ పిలిచి మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. అసంతృప్తనేతలు మాత్రం తమను ఎవరూ పిలవలేదని, సంప్రదింపులు చేపట్టలేదని ప్రకటించారు. మక్తల్‌లో అభ్యర్థిని మార్చే వరకు ఆందోళనలు చేపడతామని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అసంతృప్తులను సముదాయించిన ముఖ్యనేతలు మక్తల్‌ విషయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమైంది.

అనుచరుల ఆందోళన 
మక్తల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పట్ల కుట్ర జరుగుతోందని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ప్రగతి నివేదన సభకు ఒక రోజు ముందు అసంతృప్తనేతలంతా సమావేశం కావడం, అనంతరం వారందరూ మంత్రి లక్ష్మారెడ్డి కలవడం చకచకా జరిగిపోయాయి. తాజాగా టికెట్లను ప్రకటించిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని అసంతృప్తులను శాంతపరిచిన ముఖ్యనేతలు మక్తల్‌ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిందంటున్నారు. అంతేకాదు ఆందోళనను ముందుండి నడిపిస్తున్న వారందరూ.. పార్టీలోని జిల్లా ముఖ్యనేతలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతారనే ప్రచారం ఉంది. సదరు నేతలైనా అసంతృప్తులను పిలిచి వివాదాన్ని చల్లార్చాల్సి ఉన్నా.. వారు మౌనంగా ఉండడం చిట్టెం వర్గీయుల ఆందోళనకు కారణమవుతోంది. 

అభ్యర్థిని మార్చండి.. పార్టీని బతికించండి.. 

కృష్ణా (మాగనూర్‌): మక్తల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని మా ర్చాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు పలువు రు ‘చిట్టెం హఠావో.. టీఆర్‌ఎస్‌ బచావో’ నినా దంతో బుధవారం కృష్ణా మండల కేంద్రంలో ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ సభకు కృష్ణా, మాగనూర్‌ ఉమ్మడి మండలాల నుండి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రాజుల ఆశిరెడ్డి, గవినోళ్ల గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, జలేందర్‌రెడ్డి, ఎల్కోటి జనార్దన్‌రెడ్డి, పురం వెంకటేశ్వర్‌రెడ్డి, నర్వ వెంకట్‌రెడ్డి, నీలప్ప, మల్లేష్, తాయప్పగౌడ్‌ మాట్లాడారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో చూసినా టీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన పనులే కనిపిస్తున్నాయని తెలిపారు.

కేసీఆర్‌ హయాంలో అభివృద్ధి ఎంతో గొప్పగా జరిగినా.. తాజా మాజీ ఎమ్మెల్యే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యహరిస్తున్నాడని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, రైతులకు సబ్సిడీ ట్రాక్టర్ల మంజూరులో అక్రమాలు జరిగాయన్నారు. కాంగ్రెస్‌ నుంచి తనతో వచ్చిన వారికే అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, తాజా మాజీ ఎమ్మెల్యేనే మళ్లీ అభ్యర్థిగా ప్రకటించినందున... మార్చాలనే డిమాండ్‌తో ఉద్యమకారుల ఆధ్వర్యాన ఆత్మగౌరవ సభలను ప్రతీ మండలంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా, రాంమోహన్‌రెడ్డికి కాకుండా ఎవరికి టికెట్‌ ఇచ్చినా విజయం సులవవుతుందని వారు తెలిపారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, కృష్ణయ్య, నీలకంఠరాయ, లక్ష్మణ్, జనార్దన్, మొల్ల బాబు, భీంసీ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు