అసమ్మతి మంటలు

13 Sep, 2018 12:11 IST|Sakshi
ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత శేఖర్‌గౌడ్‌ తదితరులు

గులాబీ రాజకీయం రచ్చకెక్కుతోంది. టికెట్ల ప్రకటనతో మొదలైన చిచ్చు.. రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటివరకు కేవలం ప్రకటనలకే పరిమితమైన అసమ్మతి కాస్తా.. ఆందోళనల వరకు వెళ్లింది. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. అదేవిధంగా చేవెళ్లలో కేఎస్‌ రత్నం, ఆయన వర్గీయులు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. షాద్‌నగర్‌లో అంజయ్యయాదవ్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టీఆర్‌ఎస్‌ అధిష్టానం సిట్టింగ్‌ శాసనసభ్యులకు టికెట్లను ఖరారు చేయడంతో అసంతృప్తికి లోనైన ఆశావహులు భవిష్యత్‌ కార్యాచరణపై అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. దీంతో అసంతుష్ట నేతలతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం చర్చలు జరుపుతోంది. టికెట్టు రాకపోవడంతో నిరాశకు గురైన కొందరు మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉంటామని ప్రకటిస్తుండగా.. మంత్రి కేటీఆర్‌ జరిపిన చర్చలతో కల్వకుర్తి సెగ్మెంట్‌ అసమ్మతి నేతలు మెత్తబడ్డట్లు తెలిసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నేతలు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, విజితారెడ్డితో భేటీ అయిన ఆయన.. కలిసికట్టుగా పనిచేయాలని హితోపదేశం చేసినట్లు సమాచారం
 
రత్నం రాజీనామా.. 

గత ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. భారీగా హాజరైన అనుచరుల మధ్య పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. సొంతపార్టీ నేతల కుట్రలు, టికెట్టు ఇవ్వకుండా అవమానాలు భరించలేకే టీఆర్‌ఎస్‌కు  రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల్లో తనపై ప్రత్యర్థిగా దిగి గెలిచిన కాలె యాదయ్యను పార్టీలో చేర్చుకోవడమేగాకుండా ఆయనకే తిరిగి టికెట్టు కట్టబెట్టడంతో రత్నం వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్టు ఖరారు చేయాలని నిర్ణయించిన గులాబీ హైకమాండ్‌.. రత్నంకు వికారాబాద్‌ సీటును కేటాయించే అంశాన్ని పరిశీలించింది. దీనిపై కూడా స్పష్టతనివ్వకుండా నాన్చడంతో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే, రత్నం పార్టీని వీడకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్యవర్తిత్వం నెరిపినా ఫలితం లేకుండా పోయింది.

షాద్‌నగర్‌లో బలప్రదర్శనలు 
షాద్‌నగర్‌ సీటును సిట్టింగ్‌ శాసనసభ్యుడు అంజయ్యయాదవ్‌కు ఖరారు చేయడంతో ఆయన వైరివర్గం రోడ్డెక్కింది. మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వ్యతిరేకవర్గాలను ఏకం చేస్తోంది. సీనియర్‌ నేతలు వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేయగా  బుధవారం అంజయ్య సొంత మండలమైన కేశంపేటలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సవాల్‌ విసిరింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం.. అసమ్మతి నేతల బుజ్జగింపునకు ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డిని రంగంలోకి దించింది. ఈ మేరకు శంకర్, బాబయ్య ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపారు. అంజయ్యకు సహకరించాలని, అధికారంలోకి వచ్చినా తర్వాత అందరికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రతిపాదనలకు ససేమిరా అన్న ఇరువురి అనుచరవర్గం.. రెబల్‌గా బరిలో దిగుతామని స్పష్టం చేసింది.

‘పట్నం’లోనూ మంటలు 
ఇబ్రహీంపట్నంలోనూ అసమ్మతి రాజుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌ అసమ్మతిరాగం వినిపిస్తున్నారు. కిషన్‌రెడ్డికి టికెట్‌ కేటాయించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో కొందరు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శేఖర్‌గౌడ్‌ నేతృత్వంలో కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర అవమానభారంతో కుంగిపోతున్నారు. 2014 ఎన్నికల్లో కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచిన తనను పక్కనపెట్టడంతో నారాజ్‌ అయ్యారు. విలువలేని పార్టీలో కొనసాగడం కన్నా.. ప్రత్యామ్నాయం చూసుకోవడం మేలని ఆయనపై మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు.

 ఆగని నిరసనలు.. 
ఎల్‌బీనగర్‌లో రామ్మోహన్‌గౌడ్‌కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు జట్టు కట్టగా.. కూకట్‌పల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సీటు కేటాయించడంతో కార్పొరేటర్‌ పన్నాల కావ్య నిరసన దీక్షకు దిగారు. కుత్బుల్లాపూర్‌లో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కొలను హన్మంతరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించగా.. రాజేంద్రనగర్‌లో సీనియర్‌ నేత తోకల శ్రీశైలంరెడ్డి భారీ అనుచరగణంతో ప్రకాశ్‌గౌడ్‌కు వ్యతిరేకంగా బలప్రదర్శన చేశారు.  

మరిన్ని వార్తలు