కారు చిచ్చు

16 Sep, 2018 13:17 IST|Sakshi
శివ్వంపేటలో అసమ్మతి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మన్సూర్‌ (ఫైల్‌)

సాక్షి, మెదక్‌: నర్సాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగ రాజుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై రోజురోజుకు సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోంది. మదన్‌రెడ్డికి టికెట్‌ను కేటాయించటంపై పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతున్న వారిలో జెడ్పీచైర్‌పర్సన్‌ భర్త, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు మురళీయాదవ్‌ ముందు వరసలో ఉన్నారు. మదన్‌రెడ్డి సొంత పార్టీలో అన్నివర్గాల నాయకులకు సమాన గుర్తింపు ఇవ్వలేదని కొందరు వ్యతిరేకిస్తుండగా, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని పట్టించుకోలేదన్న అసంతృప్తి మరికొందరిలో ఉంది.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమను పట్టించుకోలేదని ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వాపోతున్నారు. మదన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో కాంట్రాక్టులు చేసి లబ్ధిపొందిన ఓ ప్రజాప్రతినిధి సైతం ప్రస్తుతం మదన్‌రెడ్డిని గట్టిగా వ్యతిరేకిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ మురళీయాదవ్, మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సహకరిస్తానని చెప్పనప్పటికీ నియోజకవర్గంలో మాత్రం మదన్‌రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మురళీయాదవ్‌ ఇప్పటికీ ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు వదులుకోలేదని తెలుస్తోంది. మదన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఏకతాటి మీదికి తీసుకువచ్చి వారి ద్వారా పార్టీ అధినేతను  కలిసి నియోజకవర్గంలో మదన్‌రెడ్డికి వ్యతిరేకత ఉందని అభ్యర్థిని మార్చాలని కోరేందుకు సిద్ధమతున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు  ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
వరస సమావేశాలు..
ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేతలు మండలాల వారీగా  ఇప్పటికే సమావేశాలు నిర్వహించటం మదన్‌రెడ్డి వర్గీయులను కలవరానికి గురిచేస్తోంది. రాబోయే రెండు రోజుల్లో కౌడిపల్లి, వెల్దుర్తి మండలాల నేతలు సైతం సమావేశాలు జరపనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దేవేందర్‌రెడ్డి  ఇటీవల తన అనుచరులతో సమావేశమై మదన్‌రెడ్డికి మద్దతు ఇవ్వొద్దని సూచించినట్లు తెలుస్తోంది.  హత్నూర మండల జెడ్పీటీసీ సభ్యురాలు పల్లె జయశ్రీ సైతం  మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈసారి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని పట్టుబడుతున్నారు. అందులో బాగంగా ముదిరాజ్‌ సంఘం ఏర్పాటు చేస్తున్న పలు సమావేశాలకు ఆమె హాజరవుతున్నారు.

జయశ్రీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ తన సొంత మండలంలోని తమ పార్టీ నాయకులందరి మద్దతు కూడగట్టడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొల్చారం మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకురాలు సోమన్నగారి లక్ష్మి కూడా  మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం మద్దతుతో పోటీకి సిద్ధమవుతున్నారు. శివ్వంపేట మండలంలోనూ అసంతృప్తి నేతల సంఖ్య పెరుగుతోంది.  మండలంలోని గోమారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ లావణ్య ఆమె భర్త నర్సాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మాదవరెడ్డిలు మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు సైతం మదన్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అనుకూలించే అంశం..
అయితే శివ్వంపేట మండలానికి చెందిన మాజీ ఎంపీపీ గోవింద్‌ నాయక్‌ ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరటం మదన్‌రెడ్డికి అనుకూలించే అంశం. కౌడిపల్లి, చిలిపిచెడ్‌ మండలాల్లో నాయకులు బాగానే ఉన్నప్పటికీ అనేక గ్రామాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు నిరాశతో ఉన్నారు.  ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో తమకు మదన్‌రెడ్డితో మాట్లాడేందుకు సరైన సమయం దొరకేదికాదని, భజన చేసే నాయకులే ఎపుడు ఆయన వెన్నంటి ఉండడంతో తాము తమ సమస్యలు ఆయనతో నేరుగా చెప్పుకోలేని పరిస్థితి ఉండేదని కింది స్థాయి నాయకులు నిరాశతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అసంతృప్తి నేతలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు ద్వారా మురళీయాదవ్‌ను తనవైపుకు తిప్పుకునేందుకు వత్తిడి తీసుకువస్తున్నారు. మురళీయాదవ్‌ భార్య రాజమణికి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి, ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కేసీఆర్‌ ఇచ్చారని, ఒకే కుటుంబంలో ఇద్దరికీ పదవులు కట్టబెట్టిన పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయానికి వ్యతిరేకిస్తే మురళీయాదవ్‌కే నష్టమన్న రీతిలో మదన్‌రెడ్డి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ వైపు చూపు..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు తమ సొంత పార్టీలో టికెట్‌ రానిపక్షంలో బీజేపీ నుంచి టికెట్‌ను పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. హత్నూర జెడ్పీటీసీ సభ్యురాలు పల్లె జయశ్రీ, కొల్చారం మండలానికి చెందిన బీసీ నినాదంతో ముందకు వెళ్తున్న లక్ష్మీలు  బీజేపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన మురళీయాదవ్‌ను తమ పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బీజేపీకి చెందిన ఓ యాదవ నేత మురళీయాదవ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మురళీయాదవ్‌ సహా పల్లె జయశ్రీ, లక్ష్మి పార్టీ వీడితే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు