జోరుపెంచిన.. కారు

19 Sep, 2018 10:53 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రచారం జిల్లాలో రోజురోజుకూ ఊపందుకుంటోంది. జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఆపార్టీ అభ్యర్థులు ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రచారంలో ఉన్న అభ్యర్థులకు ఫోన్‌లు చేసి దూకుడు పెంచాలని కోరడంతో వారు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. అధినేత టికెట్లు కేటాయించి 12 రోజులు అయినప్పటికీ అధికార పార్టీ అభ్యర్థులు అసంతృప్త నాయకుల విమర్శనాస్త్రాలను ఎదుర్కొంటూనే ఉన్నారు.

ప్రతిపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటిం చకపోవడంతో అధికార పార్టీ అభ్యర్థుల్లో కొంత సస్పెన్స్‌ కొనసాగుతోంది. తమతో పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరన్న ఆత్రుతతో వారు ఉన్నారు. అయితే ప్రచార కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటంతో పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోని ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ రూపాల్లో ప్రచారం చేపట్టారు. గ్రామాలను గు లాబీమయం చేస్తూ బైక్‌ ర్యాలీలు, యువజన విద్యార్థి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున చేరికలను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

గ్రామాలను చుట్టివస్తున్న అభ్యర్థులు..
ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ గ్రామాలను గులాబీమయం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆత్మకూరు, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సభలు నిర్వహించారు. సోమవారం జరిగిన సభలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి ప్రచార కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారని గొంగిడి సునీత ‘సాక్షి’తో చెప్పారు. భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి చాపకింద నీరులా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇప్పటికే నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ప్రచారానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ హాజరై పార్టీ విజయం కోసం పని చేయాలని కార్యకర్తలను కోరుతున్నారు. పైళ్ల శేఖర్‌రెడ్డి మండలాల వారీగా ఎంపిక చేసుకున్న గ్రామాలకు వెళ్లి అక్కడ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోపాటు పైళ్ల ఫౌండేషన్‌ ద్వారా తాను వ్యక్తిగతంగా చేసిన పనులను వివరిస్తూ మరోసారి ఆశీర్వదించమని కోరుతున్నారు. అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలను ఆయన అనుచరులు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధికి తోడు మరింత అభివృద్ధి కోసం తనను మరోసారి గెలిపించాలని ఓట్లు అడుగుతున్నారు.

కొనసాగుతున్న అసంతృప్తులు..
ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులకు అసంతృప్తుల వేడి తాకుతోంది. ప్రచార కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు అసంతృప్తుల నుంచి ఎదురవుతున్న సవాళ్లు తలనొప్పిగా మారాయి. దీంతో అసంతృప్త నేతలను గుర్తించడంతోపాటు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. అసంతృప్తులను బుజ్జగించి అనుకూలంగా మార్చుకోవాలని అభ్యర్థులకు అంతర్గతంగా ఆదేశాలు అందినట్లు సమాచారం. అయితే ఎన్నికలకు సమయం ఉన్నందున దారిలో తెచ్చుకుంటామన్న ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. ఏదిఏమైనా అసంతృప్తులతో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆలేరులో టీఆర్‌ఎస్‌ నాయకులు వంచ వీరారెడ్డి, బొళ్ల కొండల్‌రెడ్డి, కొంతం మోహన్‌రెడ్డి, మరికొంత మంది అసంతృప్తి గళం విప్పారు. భువనగిరిలో చింతల వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మరికొందరు అభ్యర్థి సీనియర్లను కలుపుకుపోవడం లేదని ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు