ఆ ముగ్గురు అభ్యర్థులు వద్దే వద్దు

3 Oct, 2018 08:12 IST|Sakshi
రమేశ్‌బాబు,తుల ఉమ, బొడిగె శోభ, రవిశంకర్,సోమారపు, కోరుకంటి చందర్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: గులాబీ దండులో అసంతృప్తి జ్వాల చల్లారడం లేదు. వేములవాడ, రామగుండంలలో అభ్యర్థుల మార్పు.. చొప్పదండిలో కొత్త వారికి టికెట్‌ కోసం లొల్లి సద్దుమణగడం లేదు. జగిత్యాలలో డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని సైతం పలువురు వ్యతిరేకిస్తుండగా, పెద్దపల్లిలో చాపకింది నీరులా అసంతృప్తి రగులుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్‌ సెంటిమెంట్‌ జిల్లా.. ఉమ్మడి కరీంనగర్‌లో అసమ్మతి రోజురోజుకూ రాజుకుంటోంది. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని  ప్రచారాస్త్రంగా మలుచుకొని అధికారం చేపట్టాలని తహతహలాడుతున్న టీఆర్‌ఎస్‌లో పలుచోట్ల అంటుకున్న అంతర్గత పోరు చల్లారడం లేదు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలతోపాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం మినహా రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేశారు. ఈసారి జరిగే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్‌ కొనసాగించాలనుకుంటోంది. అందుకే చొప్పదండి మినహా 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించగా.. పలుచోట్ల అసంతృప్తులు అధిష్టానం అంచనాలకు గండి కొడుతున్నారు.

ఆ ముగ్గురు వద్దే వద్దు..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన వెలువడి 25 రోజులు కావస్తున్నా.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో కొందరు అభ్యర్థులను మార్చాలంటూ ఇంకా పట్టుపడుతూనే ఉన్నారు. వేములవాడ, రామగుండంలలో చెన్నమనేని రమేష్‌బాబు, సోమారపు సత్యనారాయణను మార్చాలంటున్నారు. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్‌ నిలిపి వేయగా, ఆ స్థానాలలో వేరొకరికి అవకాశం కల్పించాలంటున్నారు. వేములవాడ నియోజకవర్గంలో అయితే ‘జర్మనీ బాబు’ను మార్చాలంటూ బహిరంగంగానే ఆయన వ్యతిరేకులు సభలు పెట్టి సవాల్‌ చేస్తున్నారు. పాదయాత్రలు, «ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో రోజూ వేములవాడ అట్టుడుకుతోంది. వేములవాడ అభ్యర్థిపై అసమ్మతి సెగ పతాక స్థాయికి చేరుకుంది. అభ్యర్థిత్వం ఖరారైన రోజే రమేష్‌ బాబు వ్యతిరేక వర్గం వెయ్యి మంది కార్యకర్తలతో సమావేశమైంది. రమేశ్‌బాబును తప్పించడమే లక్ష్యంగా ఆ పార్టీకి చెందిన వారంతా అదే వేదిక నుంచి బాహాటంగా ప్రకటించారు.

ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని, జెండాలు మోసి, పార్టీ కోసమే పనిచేస్తున్న తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదని, ఉద్యమ సమయంలో పార్టీలో పని చేసిన నాయకులను, కార్యకర్తలను పూర్తిగా విస్మరించి తన చెప్పుచేతల్లో ఉన్న కొంతమందితోనే రాజకీయం చేస్తున్నారని ఆయన వ్యతిరేకవర్గం బయటకు వచ్చి బాహాటంగానే ఆరోపణలు చేస్తోంది. కోరుకంటి చందర్, కొంకటి లక్ష్మీనారాయణ తదితరులు ఓ గ్రూపుగా ఏర్పడి సత్యనారాయణ టికెట్‌ రద్దు చేయాలని, లేదంటే రెబల్‌గా పోటీ చేస్తామంటున్నారు. చొప్పదండి విషయానికి వస్తే బొడిగె శోభ స్థానంలో సుంకె రవిశంకర్‌కు అవకాశం ఇవ్వాలని ఆ నియోజకవర్గంలోని మెజార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు. మంగళవారం కూడా నియోజకవర్గంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే.. శోభ మాత్రం టీఆర్‌ఎస్‌ అధిష్టానం తనకే అవకాశం కల్పిస్తుందన్న ధీమాతో ఉన్నారు. 

జగిత్యాలలోనూ అసమ్మతి సెగలు.. పెద్దపల్లిలో చాపకింద నీరులా..
జగిత్యాల నియోజకవర్గంలో సీనియర్‌ నాయకు డు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కు టికెట్‌ కేటాయించగా, అదే నియోజకవర్గానికి చెందిన ఓరుగంటి రమణారావు సైతం టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. దీంతో రెబల్‌గా పోటీ చేయాలంటూ తన అనుచరులు ఒత్తిడి చేయడంతో పోటీకి సన్నద్ధమయ్యారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత రంగ ప్రవేశం చేసి ఇరువురికి రాజీ కుదర్చడంతో సద్దుమణిగినట్లు కనిపించిన అసమ్మతి మరో రూపంలో బయటపడింది. అభ్యర్థి సంజయ్‌కుమార్‌ సమీప బంధువు పార్టీ నాయకుడు ఎం.జితేందర్‌రావుతోపాటు, బండ భాస్కర్‌రెడ్డి, ము స్కు గంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ తాటిపర్తి సరళాదేవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శంకర్‌ జగిత్యాల అభ్యర్థిని మార్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో టికెట్లు ఆశించి దక్కని నేతలు కొందరు దాసరి మనోహర్‌రెడ్డిపై అసంతృప్తి చర్యలు సాగిస్తూనే ఉన్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు ‘అసమ్మతి వర్గం’గా జట్లు కడుతున్నారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. బరిలో ఉంటామని తెగేసి చెబుతున్నారు. తమకు ఇదే ఆఖరి మోఖా అని, చావో రేవో తేల్చుకుంటామని కూడా స్పష్టం చేస్తుండటం అక్కడ కూడా సమస్యగా మారింది. ఇదిలా వుండగా 2014 ఎన్నికల సమయంలో కొత్త వాళ్లకు టికెట్లు ఇస్తే ఊరుకునేది లేదని.. సామూహికంగా రాజీనామాలు చేస్తామని మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి హెచ్చరించారు.

ఆయనతోపాటు ఆయన తనయుడు చందుపట్ల సునీల్‌రెడ్డి కూడా అప్పుడు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. తమకే టికెట్‌ వస్తుందనే నమ్మకంతో వారికి అప్పటికే మాజీ జెడ్పీటీసీగా ఉన్న పుట్ట మధుకు కేటాయించడం ఇబ్బందికరంగా మారింది. ఈసారి కూడా సునీల్‌రెడ్డి టికెట్‌ ఆశించినప్పటికీ పుట్ట మధుకే కేటా యించడం కొంత అసంతృప్తికి కారణమవుతోంది. మానకొండూరు, కోరుట్లలో కూడా కొంత కిరికిరి జరిగినా.. చివరికి సర్దుకుంది. మిగతా స్థానాల్లో అభ్యర్థుల పరిస్థితి బాగానే ఉంది. ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలన్న ఆందోళనలు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా