డజను కార్పొరేషన్లకు కేబినెట్‌ హోదా?

8 Dec, 2019 04:19 IST|Sakshi

ఆశావహుల జాబితాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఇప్పటికే ఎమ్మెల్సీ పల్లాకు కేబినెట్‌ హోదాతో నామినేటెడ్‌ పోస్ట్‌

జాబితాలో పద్మా దేవేందర్, బాజిరెడ్డి, జోగు, పట్నం, నాయిని తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావస్తోంది. రికార్డు స్థాయిలో 89 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడంతో పాటు, ఇతర పార్టీల శాసనసభ్యుల చేరికతో ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 104 మంది సభ్యుల బలం ఉంది. 40 మంది సభ్యులు ఉండే శాసన మండలిలోనూ టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ బలం ఉండటంతో మంత్రివర్గంలో చోటు కోసం సీనియర్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. అయితే గత ఏడాది డిసెంబర్‌ 13న రెండో పర్యాయం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడింది మొదలుకుని ఈ ఏడాది సెప్టెంబర్‌ 8న జరిగిన మూడో విడత మంత్రివర్గ విస్తరణ వరకు మంత్రిమండలి సభ్యుల సంఖ్య సీఎం కేసీఆర్‌తో కలుపుకుని 18కి చేరుకుంది.

మంత్రివర్గంలో వివిధ సామాజిక వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని చోటు కల్పించాల్సి రావడంతో పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర పార్టీల నుంచి చేరిన ముఖ్య నేతలకు మంత్రివర్గంలో సీఎం చోటు క ల్పించలేకపోయారు. దీంతో పలు కార్పొరేషన్లతో పాటు ఇతర నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామని ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పార్టీ సీనియర్‌ నేతలకు సంకేతాలు ఇచ్చారు.

కేబినెట్‌ హోదాలో నామినేటెడ్‌ పదవులు 
టీఆర్‌ఎస్‌ వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, టీఎస్‌ఐఐసీ సంస్థల పాలక మండళ్ల చైర్మన్ల పదవీ కాలాన్ని మాత్రమే సీఎం కేసీఆర్‌ పొడిగించారు. పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా సిద్దిపేట జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. మంత్రివర్గంలో చోటు ఆశించిన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసి, శాసన మండలి చైర్మన్‌ పదవి అప్పగించారు.

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా కేబినెట్‌ హోదాలో నియమించారు. కేబినెట్‌లో స్థానం ఆశించిన వరంగల్‌ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయభాస్కర్, శాసన మండలి సభ్యులు బోడకుంట వెంకటేశ్వర్లును ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమిస్తూ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విప్‌లుగా, శానసన సభ కమిటీ చైర్మన్లుగా నియమిస్తూ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. తాజాగా శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేబినెట్‌ హోదాలో రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమించారు. 

మరో డజను మందికి కేబినెట్‌ హోదా? 
పలు ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియమించాలనే యోచనలో ఉన్న సీఎం కేసీఆర్, కొందరికి కేబినెట్‌ హోదా కూడా కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల 29 కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ జాబితాలో మూసీనది పరివాహక (రివర్‌ఫ్రంట్‌) అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీ), రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు సంస్థ, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ), హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ, రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలు, తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికార సంస్థ, తెలుగు అకాడమీ, హాకా, అధికార భాషా కమిషన్, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సంఘం (టీఆర్‌ఈఐ), హజ్‌ కమిషన్, సాహిత్య అకాడమీ, టీఎస్‌జెన్‌కో, టీఎస్‌ ట్రాన్స్‌కో, టీఎస్‌ డిస్కమ్‌ చైర్మన్లు కేబినెట్‌ హోదా జాబితాలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల కోసం టీఆర్‌ఎస్‌లో పోటీ తీవ్రంగా ఉన్నా, కేబినెట్‌ హోదా పదవులను బాజిరెడ్డి గోవర్దన్, జోగు రామన్న, రెడ్యా నాయక్, తుమ్మల నాగేశ్వరరావు, పద్మా దేవేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు ఆశిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని వార్తలు