గులాబీ నేతల్లో అసంతృప్తి సెగలు!

21 Nov, 2016 03:19 IST|Sakshi
గులాబీ నేతల్లో అసంతృప్తి సెగలు!

♦ రెండున్నరేళ్లుగా ఎదురుచూపులతోనే సరి
♦ పార్టీ కమిటీ పదవులపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌  
సాక్షి, హైదరాబాద్‌:
గులాబీ నేతల్లో అసంతృప్తి సెగలు రేపుతోంది. టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అవుతున్నా నేటికీ పూర్తిస్థాయిలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ కాకపోవడం వారిని కుంగదీస్తోంది. పార్టీతో కలసి సాగిన వారు, పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారం చేబట్టి మరో రెండు వారాలు గడిస్తే రెండున్నరేళ్లు నిండుతాయి. అయినా ఇప్పటి దాకా తమకు ఎదురుచూపులతోనే సరిపోయిం దన్న ఆవేదన గులాబీ నేతల్లో ఉంది. ప్రభు త్వం అధికారికంగా నియమించాల్సిన నామినే టెడ్‌ పదవులే కాకుండా, ఏడాదిన్నరగా వీరికి పార్టీ పదవులు కూడా లేకుండా పోయాయి. దీనికితోడు వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నేతల అనుచ రులు సైతం ప్రధాన పోటీ దారులుగా మారా రు. దీంతో పదవులకు పోటీ ఎక్కువైంది.

చాలా వరకు ఖాళీలే....
రాష్ట్ర స్థాయిలో 20దాకా నామినేటెడ్‌ పదవులను ప్రభుత్వం భర్తీ చేసినా ఇంకా చాలా కార్పొరేషన్లు ఖాళీగానే మిగిలి ఉన్నాయి. జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను మినహాయిస్తే ఒక్క పదవీ భర్తీ కాలేదు. మార్కెట్‌ కమిటీలే 70% దాకా భర్తీ అయ్యాయని చెబుతున్నారు. ఇక మొన్నటి దాకా పాలక వర్గాలు ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థలూ ఇప్పుడు ఖాళీ అయ్యాయి. కాంగ్రెస్‌ హయాంలో గ్రంథాలయ సంస్థల చైర్మన్లుగా పదవులు దక్కించుకున్న వారూ టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఇప్పుడు వారి పదవీ కాలం కూడా ముగిసి పోయింది. ఫలి తంగా ఖాళీగా ఉన్న పదవుల సంఖ్య పెరిగిపోవడమే కాకుండా వాటి కోసం ఎదురుచూసే వారి సంఖ్యా పెరిగిపోయింది.

కుదురుకోని ‘కొత్త’ నేతలు
వివిధ పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన పలువురు నేతలు ఇంకా కుదురుకోలేనే లేదు. వాస్తవానికి వీరిని పాత నేతలే కుదురుకోనీయడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇటీవల పార్టీ సంస్థాగత కమిటీల ప్రతిపాదనలు అందజేసే విషయంలో మెజారిటీ జిల్లాల్లో మంత్రులుగా ఉన్న పలువురు పాత నేతలు కొత్త నేతల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. కొందరు మంత్రులు అభద్రతా భావంతో పార్టీలోకి వచ్చిన వారిని దూరం పెడుతున్నారని, వారికి పదవులు దక్కకుండా చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

పార్టీ కమిటీలకు అనూహ్య బ్రేక్‌
అక్టోబర్‌ చివరి వారంలోనే ప్రకటిస్తారని భావించిన పార్టీ కమిటీలకు ఇంత వరకూ అతీ గతీ లేకుండా పోయింది. వివిధ కారణాలతో నామినేటెడ్‌ పదవులతోపాటు పార్టీ పదవుల భర్తీని అధినాయకత్వం వాయిదా వేస్తూ రావడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపో తున్నాయి. ఈ నెల మొదటి వారంలో ప్రకటి స్తారని ప్రచారం జరిగినా నోట్ల రద్దు ప్రకటన తర్వాత పక్కన పెట్టారని, అనూహ్యంగా కమిటీల ప్రకటనకు బ్రేక్‌ పడిందంటున్నారు.

>
మరిన్ని వార్తలు