కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన టీఆర్‌ఎస్‌ నేతలు

29 Aug, 2019 13:50 IST|Sakshi

న్యూఢిల్లీ : రాష్ట్రంలోని ఐదు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి..వాటి నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు సహకరించాలని టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి విఙ్ఞప్తి చేశారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి గురువారం కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. శ్రీనివాస్‌ రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు జాజుల సురేందర్, హన్మంత్ షిండేల బృందం గడ్కరీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 3,155 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా నిర్మాణం చేయాలని.. ఇప్పటి వరకు కేవలం 1,388 కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లను మాత్రమే జాతీయ రహదారులుగా గుర్తించారని మంత్రికి తెలిపారు. అదేవిధంగా మరో 1,767 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేయాలని కోరారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మాణం చేపట్టేందుకు భూ సేకరణలో 50 శాతం వ్యయం, అటవీ భూముల మళ్లింపును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం కేసీఆర్ పలుమార్లు(ఆగస్ట్ 29, 2018, ఆగస్ట్ 1, 2019) కేంద్రానికి లేఖలు రాశారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.  

అదే విధంగా... ‘హైదరాబాద్‌లోని గౌరెళ్లి వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌ జంక్షన్- వలిగొండ- తొర్రూర్- నెల్లికుదురు- మహబూబాబాద్- ఇల్లందు- కొత్తగూడెం (30వ నెంబర్ జాతీయ రహదారి జంక్షన్) 234 కిలో మీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలి. మెదక్- ఎల్లారెడ్డి- రుద్రూరు 92 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేపట్టాలి. బోధన్-బాసర-బైంస 76 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మించాలి. మెదక్- సిద్దిపేట్- ఎల్కతుర్తి 133 కిలో మీటర్లు జాతీయ రహదారిగా గుర్తించి నిర్మాణం చేయాలి. చౌటుప్పల్- షాద్ నగర్- కంది 186 కిలోమీటర్ల దక్షిణ భాగంలోని ప్రాంతీయ వలయ రహదారి హైదరాబాద్ వరకు.. సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-భువనగిరి-చౌటుప్పల్ ఉత్తర భాగంలోని ప్రాంతీయ వలయ రహదారిని కలపాలి. దీనిని ఇప్పటికే జాతీయ రహదారి 161ఎఎ గా గుర్తించారు. కానీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ మొదలుపెట్టాలి. ఈ నాలుగు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణలో 50 శాతం వ్యయం భరిస్తుందని, ఆటవి భూముల మళ్లింపు వంటి ఆంశాలను చేపడుతుంది’ అని టీఆర్‌ఎస్‌ నేతల బృందం లేఖలో పేర్కొన్నారు. ఈ ఐదు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేలా సహకరించాలని కేంద్రమంత్రికి విఙ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు