'అభ్యర్థిని మార్చండి లేకపోతే ఓడిపోతాం'

9 Nov, 2018 19:21 IST|Sakshi

సాక్షి, ఆలేరు (యాదాద్రి భువనగిరి జిల్లా) : ఆలేరు నియెజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని మార్చాలంటూ ఆ పార్టీ సీనియర్‌ నాయకులు ఆధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చకుంటే ఓడిపోవడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆధిష్టానానికి చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 'సునీత నిజమైన తెలంగాణ వాదులను అవమానించారు. ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను పట్టించుకోలేదు. సునీత చేసిన అవినీతి, అక్రమాలు, ఆమె భర్త మహేందర్ రెడ్డి చేసిన గూండాయిజం, దాడులు, బెదిరింపులు వంటి చర్యలతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వపథకాలను సరైన రీతిలో అమలు చేయలేకపోయారు. దీని వల్ల నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తిచేయలేకపోయారు. అధికారంలో ఉండి ఒక్క ఎకరానికైనా అదనంగా నీరు ఇవ్వలేకపోయారు. సునీతను మార్చాలని పార్టీలో అన్ని స్థాయిల వారు పోరాడుతున్నారు, సునీత అభ్యర్థిత్వాన్ని మార్చకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము' అని సమావేశంలో సీనియర్‌ నాయకులు తెలిపారు. గౌరాయ పల్లిలో టీఆర్‌ఎస్ కార్యకర్త గొట్టం కృష్ణా రెడ్డిపై గొంగిడి మహేందర్ రెడ్డి, అతని అనుచరుల దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి,కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ఈ సమావేశంలో ఆలేరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ సుంకరి శెట్టయ్య, యాదగిరిగుట్ట మాజీ జెడ్‌పీటీసీ కొంతం మోహన్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ వంచ వీరా రెడ్డి, గతంలో సునీత ఎన్నికల ఇన్ ఛార్జ్ బోళ్ల కొండల్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  గుడిపాటి మధుసూదన్ రెడ్డి, బొమ్మల రామరాం మాజీ ఎంపీపీ మంద సంజీవరెడ్డి, ఎంపీటీసీ, గుండాల ఉప్పలయ్య, వైస్ ఎంపీపీ రాజపేట రేణుక, గట్టు నరేందర్, బోరెడ్డి ఉపేందర్ రెడ్డి, కల్లూరి మనోహర్ రెడ్డి, పలుగుల శ్రీనివాస్, రాజమల్లయ్య, సింగిరెడ్డి నరోత్తం రెడ్డి, అంబల మల్లేశంలతోపాటూ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వివిధ మండల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు