గులాబీ శ్రేణుల ఎదురు చూపు!

6 Jul, 2015 01:51 IST|Sakshi
గులాబీ శ్రేణుల ఎదురు చూపు!

ఏడాది దాటినా భర్తీకాని నామినేటెడ్ పదవులు
అడ్డుగా గ్రేటర్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
సమస్యగా కొత్త - పాత నేతల మధ్య  సమన్వయం
ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాక పదవుల భర్తీకి నాయకత్వం యోచన

సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న అధికార టీఆర్‌ఎస్ శ్రేణులకు అంత తేలిగ్గా అవి లభించే అవకాశాలు కనిపించడంలేదు.

ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమాని కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన వారి సంఖ్య తక్కువేం కాదు. ఇపుడు పార్టీలో జరుగుతున్న లొల్లి కూడా ఇదే. ప్రతీ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ దశలో నామినే టెడ్ పదవుల భర్తీతో కొత్త తల నొప్పి తెచ్చుకోవడం ఎందుకన్న భావనలో నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఫలితంగా నామినేటెడ్ పదవుల భర్తీకి అధికార టీఆర్‌ఎస్ ముహూర్తం ఖరారు చేయడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా తమను పట్టించుకోవడంలేదన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో బాగా ఉంది.

ప్రస్తుత తరుణంలో పదవుల రేసులో ఉన్న నేతలు మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెలాఖరుకల్లా శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల ప్రకటన వె లువడే అవకాశం ఉంది.  ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయితే కానీ, ప్రభుత్వ పదవులు, పార్టీ పదవుల భర్తీ గురించి ఆలోచించరని అంటున్నారు. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ తదితర కార్పొరేషన్ల ఎన్నికలు ఉండనే ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో కోరి కోరి అసంతృప్తులను కొని తెచ్చకోవడం ఎందుకన్న భావనలో నాయకత్వం ఉందని చెబుతున్నారు. ఇటీవల నాలుగు రోజుల పాటు తన ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కొందరు ముఖ్యులతో ఇదే అంశంపై చర్చించారని తెలుస్తోంది. వీటికి తోడు రాష్ట్ర పున ర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఆయా కార్పొరేషన్లకు పాలక మండ ళ్లను నియమించలేని అసహాయ స్థితిలో ప్రభుత్వం ఉంది.
 
కేసీఆర్ భరోసా ఇచ్చినా..
ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ వేదికల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులకు పలుమార్లు భరోసా ఇచ్చారు. అందరికీ పదవులు లభిస్తాయని, తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడాలని కేడర్‌లో ఆశలు రేపారు. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక పదవుల పంపకం చేపట్టే అవకాశం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు. అధికారిక పదవుల విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినా, ఎలాంటి ఇబ్బందులులేని పార్టీ పదవుల భర్తీ కూడా జరగకపోవడాన్ని టీఆర్‌ఎస్ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.

రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడు, తొమ్మిది జిల్లాలకు అధ్యక్షులు, నగర అధ్యక్షుల ఎన్నిక మాత్రమే పూర్తయ్యింది. పార్టీకి అత్యంత ప్రధానమైనదిగా భావిస్తున్న పోలిట్‌బ్యూరో ఖాళీగానే ఉంది. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల నియామకం కూడా జరగలేదు. దీంతో నామినేటెడ్ పదవులు వచ్చినా, రాకున్నా కనీసం పార్టీ పదవి కూడా లేకుండా పోయిందని మదన పడుతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

ఇక కొత్త-పాత శ్రేణుల మధ్య సమన్వయం సాధించడం పార్టీ నాయకత్వానికి తలకు మించిన భారంగానే ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ అధిగమించేందకు, పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని తొలగించేందుకు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక పదవులు భర్తీ చేద్దామన్న నిర్ణయానికి నాయకత్వం వచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు