పదవులు ఏవీ.. అధ్యక్షా !

25 Mar, 2018 09:49 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ నేతల ఎదురుచూపులు

నాలుగేళ్లుగా ఊరిస్తున్న నామినేటెడ్‌ పదవులు

వలసొచ్చిన వారికి మొండిచేయి..అసంతృప్తిలో నేతలు

ఇంకా భర్తీ కానీ ప్రధాన మార్కెట్‌ కమిటీల పాలకమండళ్లు

నేతల చుట్టూ తిరుగుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు

సమాధానం చెప్పలేక పోతున్న ఎమ్మెల్యేలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పార్టీ ఆవిర్భావంనుంచి కొనసాగుతున్న వారికీ ఎలాంటి పదవీయోగం దక్కక గులాబీ నేతలు ఆవేదన చెందుతున్నారు. దశాబ్ధంన్నరకుపైగా జెండా మోస్తున్న వారిలో చాలామందినీ ఆ పార్టీ అధినాయకత్వం కరుణించలేదు. టీఆర్‌ఎస్‌లో ముందునుంచీ ఉన్న నాయకులే కాకుండా, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి ఏదో ఒక సందర్భంలో వచ్చి చేరిన వారికీ మొండిచేయే చూపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ పదవుల కోసం ఆశగా ఎదరుచూస్తున్న వారిలో పధ్నా లుగేళ్ల పాటు ఉద్యమంలో పాల్గొని, పార్టీలో కొనసాగుతున్న వారున్నారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయ్యాక, తొలిప్రభుత్వాన్ని ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేయడంతో ఈ నేతలంతా తమకు ఏదో ఒక పదవి దక్కక పోతుందా అని ఆశపడిన వారే.

కానీ, నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపు గొడవలు పదవుల భర్తీకి పెద్ద అడ్డంకిగా మారాయి. జిల్లాకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పోస్టులు రెండు దక్కినా,  చాలా మందికి ఎలాంటి అవకాశం దక్కలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ, వివిధ దేవాలయాలకు పాలక మం డళ్లు నియమించారు. వివిధ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలకమండళ్ల నియామాకాల్లోనూ గ్రూపు రాజకీయాలు చోటు చేసుకోవడంతో కొన్ని ప్రధాన మార్కెట్‌ కమిటీల భర్తీ చేపట్టలేదు. దీంతో చాలా మందికి అవకాశం దక్కకుండా పోయింది. ద్వితీయశ్రేణి నాయకులు తమ ఎమ్మెల్యేలపై నిత్యం ఒత్తిడి తెస్తున్నా, వారూ సమాధానం చెప్పలేకపోతున్నారని పేర్కొం టున్నారు. మరో ఏడాదిలో ప్రభుత్వ పదవీ కాలం ముగియనుండడంతో ఇంకా ఎప్పుడు పదవులు ఇస్తారన్న ప్రశ్న గులాబీ శ్రేణులనుంచి వస్తోంది.

పదవుల భర్తీ ప్రశ్నార్ధకం ?
నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన దుబ్బాక నర్సింహారెడ్డికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌  చైర్మన్‌ పదవి ఇస్తామని బహిరంగంగా ప్రకటించి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ అతీగతీ లేకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తితోనే ఉన్నారు. నల్లగొండలోనే గతంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌కు వచ్చిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బోయపల్లి కృష్ణారెడ్డి వంటి సీనియర్‌ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ప్రధానమైన మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యింది. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా చేసిన అమరేందర్‌రెడ్డి , కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు తమ అనుచరుల కోసం వేర్వేరు జాబితాలు ఇవ్వడంతో ఇప్పటికీ పాలకమండలి నియామకం జరగలేదు. ముందు నుంచీ పార్టీలో కొనసాగుతున్న, గతంలో ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేసి నాగార్జునాచారి వంటి వారికి అవకాశమే దక్కలేదు. కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే విజయ సింహారెడ్డి, చింతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌కు పదవులు దక్కలేదు.
    
నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సీఎల్పీ నేత జానారెడ్డికి దగ్గరి అనుచర నేతలుగా పేరున్న మ్మడి రాష్ట్రంలో ఆప్కాబ్‌ చైర్మన్‌గా పనిచేసిన ఎడవెల్లి విజయేందర్‌ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, గార్లపాటి ధనమల్లయ్య వంటి వారు  టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. విజయేందర్‌రెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ పదవి రేసులో నిలిచినా, ఆయన మండలానికే పరిమతమయ్యారు. ఇక, ముందునుంచీ టీఆర్‌ఎస్‌ జెండా మోసిన వర్రెవెంకటేశ్వర్‌రెడ్డి, నియోజకవర్గఇన్‌చార్జ్‌గా రెండు సార్లు వ్యవహరించిన బొల్లేపల్లి శ్రీనివాస్‌రావు వంటి వారికి పదవీయోగం కలగలేదు.

దేవరకొండ నియోజకవర్గంలో గ్రూపులలొల్లి తప్పడం లేదు. దీంతో పదవుల భర్తీకి ఆటంకం కలుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవినీ భర్తీ చేయలేదు. దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన బండారు బాల నర్సింహకు ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయి. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఆయన ఆశించినా ఇప్పటికీ దక్కలేదు. జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌ వెంట కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన మైనారిటీ నాయకుడు సిరాజ్‌ఖాన్‌కు గుర్తింపు దక్కలేదు. ఆయనను జెడ్పీ కో–ఆప్షన్‌ సభ్యుడిగా నియమిస్తామని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేక పోయారు.

పీఏపల్లి మండలానికి చెందిన ఏవీ రెడ్డి, అదే మాదిరిగా నాయిని మాధవరెడ్డి, సురేష్, నిస్సార్‌ అహ్మద్‌ వంటి నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రం నల్లగొండ మార్కెట్‌ కమిటీకి పాలక మండలిని నియమించడానికి పార్టీ నాయకత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు