గులాబీ గుబాళింపు

31 Jan, 2019 09:50 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : పల్లెపోరులో గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో 837 పంచాయతీలకు ఎన్నికలు జరగగా... టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 520 పంచాయతీల్లో విజయం సాధించి తమ పట్టును నిరూపించుకున్నారు. తొలి రెండు విడతల్లో దేవరకొండ, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్లలో 20 మండలాల పరిధిలోని 580 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 380 పంచాయతీలు టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల ఖాతాలోకే వెళ్లాయి.

బుధవారం మూడో విడత నల్లగొండ డివిజన్‌లోని 11 మండలాల పరిధిలో ఉన్న 241 పంచాయతీల్లో (మొత్తం 257 కాగా, 16 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి) పోలింగ్‌ జరిగింది. మూడో విడతలో  టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 140 పంచాయతీల్లో గెలిచారు. దీంతో మొత్తంగా జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 520 పంచాయతీల్లో, కాంగ్రెస్‌ మద్దతుదారులు 268 పంచాయతీల్లో, స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుదారులంతా కలిపి 49 పంచాయతీల్లో విజయం సాధించారు.

ఏకగ్రీవాల ద్వారానే 102
మూడు విడతల పంచాయతీ సమరంలో ఏకగ్రీవాల ద్వారానే టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 102 చోట్ల విజయం సాధించారు. తొలి విడతలో భాగంగా ఈ నెల 21వ తేదీన దేవరకొండ డివిజన్‌లోని 305 గ్రామ పంచాయతీలకు గాను 52 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, వీరిలో 50 మంది టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఉన్నారు.  ఈ నెల 25వ తేదీన మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో  276 గ్రామ పంచాయతీలకుగాను 43 మంది సర్పంచులు ఏకగ్రీవం కాగా, వీరిలో 42 మంది టీఆర్‌ఎస్‌ వారే ఎన్నికయ్యారు. మూడో విడతలో 257 పంచాయతీల్లో కేవలం 16 పంచాయతీల్లో మాత్రం సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 10 మంది టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఉన్నారు. మొత్తంగా మూడు విడతల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవాల ద్వారానే 102 పంచాయతీలను సొంతం చేసుకున్నారు.

చిత్రమైన పొత్తులు
పల్లెలపై పట్టుకోసం ఆయా పార్టీలు పంచాయతీ సమరంలో చిత్ర విచిత్రమైన పొత్తులు పెట్టుకున్నాయి. పూర్తిగా పార్టీ రహిత ఎన్నికలే అయినా... ప్రతి పంచాయతీలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, ఆ పార్టీ నేతల ప్రచారం చేయకుండా ఎన్నికలు జరగలేదు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌లో సర్పంచ్‌ టికెట్లకు గట్టి పోటీ ఏర్పడింది. దీంతో పదుల పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ వర్గీయుల్లోనే పోటీ నెలకొంది. మరోవైపు పంచాయతీలను గెలుచుకునేందుకు స్థానిక పరిస్థితులను బట్టి పార్టీల మద్దతుదారులు పొత్తులు పెట్టుకున్నారు. అయితే.. ఒక పంచాయతీకి మరో పంచాయతీకి పోలికే లేకుండా అయ్యింది. కొన్ని పంచాయతీల్లో టీఆర్‌ఎస్, సీపీఎం, ఇతర పార్టీలు కలిస్తే, మరికొన్ని పంచాయతీల్లో కాంగ్రెస్‌ సీపీఎం, ఇతర పార్టీలు కలిశాయి. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, సీసీఎం, తదితర పార్టీలు కలిసి పోటీ చేసిన పంచాయతీలు కూడా ఉన్నాయి. ఆయా పార్టీల మద్దతుదారులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీలో నిలిచిన వారికి ఎదుటి పక్షం వారూ మద్దతిచ్చి గెలిచిపించిన ఉదంతాలు ఉన్నాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా పంచాయతీ సమరంలో చిత్రవిచిత్రమైన పొత్తులు కనిపించాయి. పొత్తుల్లో ఉప సర్పంచ్‌ పదవులే కీలకంగా మారాయి.
 

ఉనికి నిలబెట్టుకున్న కాంగ్రెస్‌
పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు అనుకూలంగా గాలి వీచినా.. కొన్ని మండలాల్లో కాం గ్రెస్‌ మద్దతు దారులు సైతం సమ ఉజ్జీలుగా నిలిచారు. జిల్లా మొత్తంలో ఆ పార్టీ మద్దతుదారులు 268 పంచాయతీల్లో గెలిచారు. తొలి రెండు విడతల్లో ఏకంగా 167 చోట్ల విజయం సాధించారు. మూడో విడతలో 101 పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా మొత్తం గా 268 పంచాయతీల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ మద్దతుదారులు తమ పార్టీ ఉనికిని నిలబెట్టారు.

కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌లకు అభినందనలు : కోమటిరెడ్డి
నల్లగొండ రూరల్‌ : నల్లగొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. గెలుపొందిన వారంతా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడంతోపాటు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవద్దన్నారు. పదవి ఉన్నా లేకున్నా నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పటిష్టత కోసం గెలుపొందిన అభ్యర్థులు కృషి చేయాలని కోమటిరెడ్డి కోరారు.    

మరిన్ని వార్తలు