దక్షిణంపై టీఆర్‌ఎస్‌ ‘గురి’!

27 Jun, 2018 01:39 IST|Sakshi

దక్షిణంపై టీఆర్‌ఎస్‌ ‘గురి’!

సాక్షి, హైదరాబాద్‌:  సాధారణ ఎన్నికల నాటికి విపక్షాలను నిర్వీర్యం చేసేలా.. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ పాగా వేసేలా అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహం పన్నుతోంది. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆకర్షించడం ద్వారా విపక్షాల ఆత్మ విశ్వాసంపై దెబ్బకొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఐదారు నెలలకే మొదలుపెట్టిన ‘ఆకర్ష్‌’వ్యూహాన్ని మరింత ముమ్మరం చేసేలా టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకత్వం బలహీనంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. విపక్షాల్లో కొంచెం పేరున్న నాయకులెవరూ మిగలకుండా చేసి.. ఎన్నికల నాటికి వాటిని నైతికంగా బలహీనం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. 

ప్రధాన నేతలంతా టార్గెట్‌! 
గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు సాధించడంతో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించాయి. దాంతో ‘ఆకర్ష్‌’కు తెరతీసిన టీఆర్‌ఎస్‌ అధినేత.. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో అన్ని పార్టీల సీనియర్లను, ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు మరింతగా దూకుడు పెంచారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం పరిధిలో టీఆర్‌ఎస్‌ కేవలం ఒక్క కొత్తగూడెం స్థానానికే పరిమితమైంది.

మిగతా స్థానాల్లో కాంగ్రెస్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఇందుకు పూర్తి భిన్నంగా అత్యధిక స్థానాలు సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వర్‌రావును టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మంత్రివర్గంలోకీ తీసుకున్నారు. తరువాత కాలంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలను, పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇక రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఉప ఎన్నికలు జరిగిన పాలేరు స్థానంలో టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఉమ్మడి ఖమ్మంలో ప్రస్తుతానికి కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. 

ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టే వ్యూహం 
నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో ఇతర పార్టీల్లో ఉన్న ఎంపీ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రనాయక్‌తో పాటు జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌ వంటి వారంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో బలమైన ద్వితీయ శ్రేణి నాయకులను గులాబీ పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి సీనియర్లు మాత్రమే మిగిలారు. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నారు. ఇక్కడ మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి తదితర నేతలే కాంగ్రెస్‌కు మిగిలారు. ఈ రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ నేతలను దెబ్బకొట్టడానికి వారి నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ఇతర సీనియర్లను, ద్వితీయ శ్రేణి నేతలకు గులాబీ కండువా కప్పారు.  

హైదరాబాద్, రంగారెడ్డిలపై ప్రత్యేక దృష్టి 
రాష్ట్రంలో కీలకమైన గ్రేటర్‌ హైదరాబాద్, రంగారెడ్డిలపైనా గులాబీ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే వచ్చింది. మిగతా సీట్లను విపక్షాలు దక్కించుకున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్‌కు నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో విపక్షాల నుంచి నేతలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు సీనియర్లు, బలమైన నాయకులు లేరు. దాంతో ఆయా చోట్ల కాంగ్రెస్, టీడీపీల నుంచి బలమైన నేతలను చేర్చుకుంటున్నారు. ఈసారి సికింద్రాబాద్‌ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహం పన్నుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో టీడీపీని ఉనికిలో కూడా లేకుండా చేసిన సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు ముఖ్యులను ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తాజాగా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు బలమైన నాయకులు, కేడర్‌ ఉన్న నేతలు లేకుండా చేసేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు