గెలిచారు.. ఓడారు..

14 Dec, 2018 10:51 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినా.. జిల్లాలో అన్ని స్థానాల్లో ఓటమే

కూటమి 5 సీట్లు గెలిచినా.. రాష్ట్రంలో పరాభవం 

ఇరుపక్షాలకూ ఆనందం సగమే  

సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలోని అధికార, ప్రతిపక్షాల్లో ఒకవైపు మోదం, మరోవైపు ఖేదం నెలకొంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం సగమే అయింది. జిల్లాలోని ఐదు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్‌ కూటమి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర మథనంలో పడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర అన్ని జిల్లాల్లో అధికార టీఆర్‌ఎస్‌ దాదాపు స్వీప్‌ చేసినట్టుగా ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే భద్రాద్రి జిల్లాలో మాత్రం సీన్‌ పూర్తి రివర్స్‌ అయింది.

ఇక్కడ టీఆర్‌ఎస్‌ అసలు ఖాతానే  తెరవలేదు. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు, టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే టీఆర్‌ఎస్‌ నుంచి జలగం వెంకట్రావు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో మాత్రమే ‘కారు’కు డిపాజిట్‌ దక్కింది. ఉమ్మడి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ధరావత్తు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పినపాక, అశ్వారావుపేట, వైరా స్థానాల్లో గెలిచింది. ఇల్లెందు, పాలేరు, మధిర, ఖమ్మం సీట్లలో కాంగ్రెస్, సత్తుపల్లిలో టీడీపీ, భద్రాచలంలో సీపీఎం అభ్యర్థులు విజయం సాధించారు. తర్వాత కాలంలో వైరాలో గెలిచిన మదన్‌లాల్, అశ్వారావుపేట నుంచి గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, పినపాకలో గెలిచిన పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందులో గెలిచిన కోరం కనకయ్య, ఖమ్మంలో గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.

పాలేరు నుంచి గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. దీంతో టీఆర్‌ఎస్‌కు ఏడు స్థానాల్లో ప్రాతినిధ్యం లభించి జిల్లాలో మంచి బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ గాలి వీచింది. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌ కూటమిని తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీకి చెందిన మహా మహా నాయకులు ప్రజాతీర్పుతో మట్టికరిచారు. అయితే జిల్లాలో మాత్రం తీర్పు ఇందుకు భిన్నంగా వచ్చింది. టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆయా నియోజకవర్గాల్లో ఓటమిపాలైంది.  పినపాక, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల స్వయంకృతాపరాధమే ఓటమి పాలు చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ పోటీ నడిచింది. ఈ మూడు చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపు సమీపానికి వచ్చి ఓటమి చెందారు.

సిట్టింగ్‌లకు నో చాన్స్‌..  
జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలంతా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు గెలిచిన వారందరూ కొత్తవారే. అయితే కొత్తగూడెంలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, పినపాకలో గెలిచిన రేగా కాంతారావు గతంలో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించినవారే. ఇల్లెందు నుంచి గెలుపొందిన బాణోత్‌ హరిప్రియ, అశ్వారావుపేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. హరిప్రియ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం కాగా, ఈసారి కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. మెచ్చా నాగేశ్వరారవు గతంలో టీడీపీ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా అదే పార్టీ నుంచి గెలుపొందారు. భద్రాచలం నుంచి గెలిచిన పొదెం వీరయ్య జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు ప్రాతినిథ్యం వహించారు. ఈ సారి భద్రాచలం నుంచి ఎన్నికయ్యారు. ములుగు టికెట్‌ సీతక్కకు ఇవ్వడంతో చివరి నిమిషంలో భద్రాచలం వచ్చిన వీరయ్య.. వారం రోజుల ప్రచారంతోనే విజయం సాధించడం విశేషం.

మోదం.. ఖేదం..
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్రభంజనం వీయగా, జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. దీంతో రెండు పక్షాల్లోనూ మోదం, ఖేదం కలిగింది. ఓడినప్పటికీ ప్రభుత్వం అండతో నియోజకవర్గాల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని టీఆర్‌ఎస్‌ నుంచి ఓడిపోయిన అభ్యర్థులు చెపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతామని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ సమీకరణలు ఎలా మారతాయోనని జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  

మరిన్ని వార్తలు