ఆర్టీసీ విలీనం జరగదు: ప్రశాంత్‌ రెడ్డి

12 Oct, 2019 20:32 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికుల సమ్మెపై  ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అక్కడ ఆర్టీసీని విలీనం చేయకుండా..తెలంగాణలో మాత్రం భిన్నంగా విలీనం చేయాలంటూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు  నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్‌ అయిన ‘ప్రభుత్వంలో ఆర్టీసీ వీలీనం’ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని స్పష్టం చేశారు.  ఆర్టీసీని విలీనం చేస్తామని టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో పెట్టలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఎప్పుడూ చెప్పలేదన్నారు.

గొంతెమ్మ కోర్కెలు సమంజసం కాదు..
ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన దాని కంటే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు అధికంగా పెంచామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ఇచ్చి గౌరవించారని తెలిపారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అన్ని వర్గాల బాగోగులు చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల అనైతిక డిమాండ్‌ను తీర్చడం కంటే నాలుగు కోట్ల ప్రజల అవసరాలు తీర్చడమే’ ముఖ్యమని ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం సమంజసం కాదన్నారు. ఆర్టీసీలో సంస్కరణలు తెచ్చి పేదలకు మంచి సేవలు అందించాలన్నదే సీఎం ధ్యేయం అని పేర్కొన్నారు. ఆర్టీసీ లాభాల బాటలోకి తేవడమే కేసీఆర్‌ ఉద్దేశమని తెలిపారు. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్‌, బీజేపీలు ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టి.. వారికి నష్టం చేసాయని వెల్లడించారు. ప్రతిపక్షాల చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనించాలని ప్రశాంతరెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు