ఇంటికి పిలిచి..చెంపచెళ్లు..!

11 Dec, 2017 11:16 IST|Sakshi

కాంట్రాక్టర్‌పై చేయిచేసుకున్నఅధికార పార్టీ ఎమ్మెల్యే  

పరోక్షంగా అన్న మాటలపై పట్టింపులు

 మాట్లాడాలనే పనిఉందంటూ ఇంటికి ఆహ్వానం

 వెంట తీసుకెళ్లిన మరో మాజీ ఎమ్మెల్యే సోదరుడు

 వాడీవేడి చర్చల్లో ఎమ్మెల్యే మెరుపు దాడి

 వివరాలు సేకరిస్తున్న ఇంటెలిజెన్స్‌ విభాగం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: క్రషర్‌ యజమానులు, కాంట్రాక్టర్ల సమస్య పరిష్కారం అంశం ఎమ్మెల్యే ఒకరిపై దాడి చేసే వరకు వెళ్లింది. పలువురు కాంట్రాక్టర్ల ఎదుటే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. ఓ గుత్తేదారుపై చేయిచేసుకున్నాడు. మాట్లాడుతున్న క్రమంలో జరిగిన దాడితో సదరు కాంట్రాక్టర్‌ నిర్ఘాంతపోయాడు. అయితే బాధిత కాంట్రాక్టర్‌ కుటుంబానికి రాజకీయాలతో సంబంధాలు ఉండడం వల్ల ఇరువర్గాల మధ్య వివాదం పెద్దదిగా మారింది. చివరికి ఇంటెలిజినెన్స్‌ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక సైతం తయారు చేశాయి.

స్టోన్‌ క్రషర్ల విషయంలో వివాదం..
స్టోన్‌ క్రషర్ల విషయంలో తలెత్తిన వివాదం కాంట్రాక్టర్‌పై దాడికి కారణమైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో ఉన్న స్టోన్‌క్రషర్లు, హాట్‌మిక్స్, రెడిమిక్స్‌ ప్లాంట్ల నిర్వహణతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందంటూ కొంద రు ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే సమయంలో క్రషర్ల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని  సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న స్టోన్‌క్రషర్‌ కార్యకలా పాలు నిలిపేయాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాలుష్య నియం త్రణ, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసే వరకూ ఇదే పరిస్థితి కొనసాగించాలంటూ తీర్పు వెలువరించడంతో స్టోన్‌క్రషర్లు మూతపడ్డాయి. దాదాపు నెలరోజులుగా ఈ పరిస్థితి కొసాగుతుండగా..

అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్‌ నడుస్తుండడంతో ఇతర యజమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరు యజమానులు ఫోన్లో మాట్లాడుకున్న సందర్భంలో ఎమ్మెల్యేకు చెందిన క్రషర్‌ విషయం ప్రస్తావనకు వచ్చింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఓ క్రషర్‌ యజమాని, మరో క్రషర్‌ యజమాని (ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడు)తో ఫోన్‌లో ఆవేదన వ్యక్తం చేస్తూ అధికార ఎమ్మెల్యే క్రషర్‌ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఎమ్మెల్యేకు సంబంధించిన క్రషర్‌ ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంటే మనకు ఈ ఇబ్బందు లేంటి. మనల్ని వాడు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆయన పని చల్లగా చేసుకుంటున్నాడు. ఇదేం పద్ధతి. మనం మాత్రం ఏ పాపం చేశాం’ అంటూ ఓ క్రషర్‌  యాజమాని వ్యాఖ్యానించాడు. ఫోన్లో జరిగిన ఈ సంభాషణను మాజీ ఎమ్మెల్యే సోదరుడు ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టి కి తీసుకువెళ్లి అందరం ఇబ్బందిపడుతున్నామని వివరిస్తూనే ఫోన్‌ సంభాషణను వినిపించాడు. దీంతో ఎమ్మెల్యేకు కోపమొచ్చి ఆయన్ను తీసుకురా అని చెప్పాడు.

మెరుపుదాడి..
ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేసిన సదరు కాంట్రాక్టర్‌కు రాజకీయ నేపథ్యం ఉంది. అతడి కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. దీంతో ఇరువురి మధ్య కాంప్రమైజ్‌ కోసం ఎమ్మెల్యే ఇంట్లో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు యజ మానులు, కాంట్రాక్టర్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే సోదరుడు, ఫోన్‌లో మాట్లాడిన క్రషర్‌ యజమానిని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తనపైనే వాఖ్యలు చేస్తావా, వాడు.. వీడు అంటావా అని క్రషర్‌ యజమానిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఒక్క ఉదుటన లేచి కాంట్రాక్టర్‌పై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

ఆర్థిక, అంగబలం పుష్కలంగా ఉన్న తనపై ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఆ నాయకుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. సమస్య పరిష్కరించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తే కొత్త సమస్య ఎదురుకావడంతో క్రషర్‌ యజమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయం చినికిచినికి గాలివానలా మారడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేతో దాడికి గురైన వ్యక్తికి ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యలతోనూ దగ్గరి పరిచయాలు ఉండడంతో విషయం హైదరాబాద్‌కు వరకు చేరింది. అసలు ఏం జరిగిందో తెలియజేయాలంటూ అక్కడి నుంచి ఇంటలిజెన్స్‌ వర్గాలకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. చివరికి ఈ అంశానికి ముగింపు ఎలా ఉంటుందనేది రాజకీయ, కాంట్రాక్టర్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు