కారు..జోరు!

28 Oct, 2018 12:52 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  ముందస్తు ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ జోరు కొనసాగుతోంది. అసెంబ్లీ రద్దు అనంతరం ఒకేసారి బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించడం... వారంతా ప్రచారంలో నిమగ్నం కావడం అంతా చకచకా జరిగిన విషయం విదితమే. తాజాగా ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవలే మంత్రి హరీశ్‌రావు పర్యటన నాగర్‌కర్నూల్‌లో, తాజాగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. అలాగే సోమవారం మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు.

మక్తల్, అచ్చంపేటల్లో జరిగే బహిరంగసభల్లో కేటీఆర్‌ పాల్గొంటారు. ఇక ఈనెల 31న నారాయణపేటలో జరిగే మైనారిటీల సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ హాజరుకానున్నారు. అదే వి«ధంగా నవంబర్‌ మొదటి వారంలో స్వయంగా సీఎం కేసీఆర్‌ పాలమూరు జిల్లాకు మరోసారి రానున్నారు. ఈసారి మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్వయంగా కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇలా మొత్తం మీద టీఆర్‌ఎస్‌ తన ప్రచారంలో జోరు పెంచుతోంది.
 
ఆశలన్నీ లబ్ధిదారులపైనే... 
సీఎం కేసీఆర్‌ సెప్టెంబర్‌ 6న అభ్యర్థులను ప్రకటించిన వెంటనే వారు రంగంలోకి దిగారు. దాదాపు 50రోజులుగా నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని ఖచ్చితంగా కలవాలని సీఎం కేసీఆర్‌ స్వయంగా అభ్యర్థులకు హితబోధ చేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ప్రతీ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారనే విషయాలతో కూడిన జాబితాను అందజేశారు.

ఈ మేరకు అభ్యర్థులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో పాటు కేసీఆర్‌ కిట్, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని నేరుగా కలుస్తున్నారు. మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే చేయబోయే పనులను, చేకూరనున్న లబ్ధిని ఈ సందర్భంగా వివరిస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై పుస్తకాలు, కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తుండడమే కాకుండా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వీడియో తెరల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో రూపొందించిన వీడియో ప్రసారాల కోసం ప్రత్యేక వాహనాలను సైతం సమకూర్చుకున్నారు. ఇలా మొత్తం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరూ ప్రభుత్వ లబ్ధిదారుల మీదే గంపెడాశలు పెట్టుకున్నారు.

 
రంగంలోకి ముఖ్యనేతలు 
ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు రంగం ప్రవేశం చేస్తున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి సీఎం కేసీఆర్‌ 40 మందికి బాధ్యతలు అప్పగించిన విష యం తెలిసిందే. ఆయా నేతలందరూ నిత్యం ప్రతీ జిల్లాలో ఏదో ఒక కార్యక్రమం రూపొందించుకుని ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యనేతలందరూ కూడా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా నాగర్‌కర్నూల్‌లో మంత్రి హరీశ్‌రావు రెండు రోజు ల క్రితం పర్యటించగా.. తాజాగా శనివారం కల్వకుర్తి నియోజకవర్గంలో హోంమంత్రి నాయిని న ర్సింహారెడ్డి పర్యటించి, అభ్యర్థుల తరఫున ప్రచా రం చేశారు. ఈ నెల 29న(సోమవారం) మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి జిల్లాలోని మక్తల్, అచ్చంపేటల్లో జరగనున్న బహిరంగసభల్లో పాల్గొననున్నారు. అలాగే నవంబర్‌ మొదటి వారంలోని 3 లేదా 4 తేదీల్లో సీఎం కేసీఆర్‌ సభను జడ్చర్లలో నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు.
 
అసమ్మతిపై వేటు ఖాయం 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓ పక్క ప్రచారంలో దూసుకువెళ్తుండగా.. అక్కడక్కడా అసమ్మతి గళాలు గొంతెత్తుతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో అసమ్మతి రాగం వినిపిస్తున్న కల్వకుర్తి, మక్తల్‌ నియోజకవర్గాల్లోని నేతలపై వేటు వేయడం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసమ్మతి నేతల కారణంగా పార్టీ అభ్యర్థులకు కొత్త చిక్కులు వస్తున్నాయనేది టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోసం స్వయంగా మంత్రి కేటీఆర్‌ బహిరంగసభను రద్దు చేసుకున్నారు. అయితే అసమ్మతి నేతలకు ఎంతగా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు దారికి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభల నిర్వహణకు దూరంగా ఉంటే వేటు వేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.

తాజాగా మక్తల్‌ బహిరంగ సభ నేపథ్యంలో అక్కడి నేతల అభిప్రాయాలను ఆరా తీస్తున్నారు. కానీ మక్తల్‌లోని అసమ్మతి నేతలు మాత్రం మెట్టుదిగడం లేదు. ఈ నేపథ్యంలో వారిపై వేటు వేయాలని పార్టీ కూడా నిర్ణయించింది. అలాగే కల్వకుర్తి విషయంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోసం టీఆర్‌ఎస్‌ దూతలు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ససేమిరా అంటున్నట్లు తెలిసింది. దీంతో సాధ్యమైనంత త్వరలో ఎమ్మెల్సీ కసిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు