భోజ్యానాయక్‌ త్యాగం మరువలేనిది

25 Mar, 2018 08:13 IST|Sakshi
భోజ్యానాయక్‌ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

రఘునాథపల్లి:  తెలంగాణా అమరవీరుడు లునావత్‌ భోజ్యానాయక్‌ త్యాగం మరువలేనిదని  స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం మండలంలోని అశ్వరావుపల్లి శివారు వీరారెడ్డి తండాలో భోజ్యానాయక్‌ ఆరో వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై భోజ్యానాయక్‌ సమాది వద్ద పార్టీ నాయకులతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నామాల బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.

గండ్ర తీరుతోనే భోజ్యా నాయక్‌ ఆత్మహత్య..
 హన్మకొండ  కలెక్టర్‌ కార్యాలయం సమీపంలోని రహదారిపై ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని భోజ్యానాయక్‌ నిప్పంటించుకున్నాడని ఎమ్మెల్యే గుర్తు చేశారు.  92 శాతం గాయాలతో ఎంజీఎం అస్పత్రిలో చికిత్స పొందుతున్న భోజ్యానాయక్‌ను తాను కలిసినప్పుడు ‘రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే తెలంగాణ వస్తదా ..? రాదే రాదు’ అని  గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అమరవీరుని తల్లిదండ్రులు మంక్తి, నామాల కడుపు కోత తీర్చలేనిదన్నారు. భోజ్యానాయక్‌ నగర్‌ పేరిట వీరారెడ్డి తండాలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా హామి ఇచ్చారు.

వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
తెలంగాణ కోసం అమరుడైన భోజ్యానాయక్‌ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాలని ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గాంధీనాయక్‌ కోరారు. అమరుడు భోజ్యానాయక్‌ తల్లిదండ్రులు మంక్తి, నామాలకు గాంధీనాయక్‌ పాదాభివందనం చేశారు. వర్ధంతి సభలో ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ బానోతు శారద, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, ఎంపీటీసీ దొనికల రమాదేవి, సర్పంచ్‌ విజయలక్ష్మి, నాయకులు గుడి వంశీధర్‌రెడ్డి, మారుజోడు రాంబాబు, చెంచు రమేష్, గొరిగ రవి, మడ్లపల్లి సునిత, మాలోతు నర్సింహ్మా, కుర్ర కమలాకర్, నీల ఆగయ్య, రాజేందర్‌నాయక్, అంజనేయులు, వెంకటేష్‌యాదవ్, గైని రాంచందర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు