‘వారితో ఎలా జతకట్టారో ప్రజలకు చెప్పాలి’!

11 Oct, 2018 16:29 IST|Sakshi
మాట్లాడుతున్న కవిత

సాక్షి, జగిత్యాల : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు సూత్రదారి, రేవంత్‌ రెడ్డి పాత్రదారి అన్న జీవన్‌ రెడ్డి! తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేసిన వారితో ఎలా జత కట్టారో జగిత్యాల ప్రజలకు చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత అన్నారు. గురువారం జగిత్యాలలో జరిగిన టీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగిత్యాల నియోజకవర్గంలో చేసిన ప్రతి పనిలో తన స్వార్థం చూసుకున్న జీవన్‌ రెడ్డితో రమణ ఎలా జతకట్టారో సమాధానం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదంటున్న ఇద్దరు నాయకులకు ఆ ప్రశ్న అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.

టీడీపీ, కాంగ్రెస్ నాయకులు.. ఎల్.రమణ, జీవన్ రెడ్డిలు కుంభమేళాలో విడిపోయి కలిసినట్టు ఒకే వేదికపైకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రతి తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకుడు అడుగడుగునా తెలంగాణకు అడ్డువచ్చారన్నారు. ఉద్యమ సమయంలో ఎల్‌ రమణ! చంద్రబాబుకు భయపడి ఇంటినుంచి బయటకు రాలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పరాయిపాలన వద్దనే కదా!.. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి, టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుందని పేర్కొన్నారు. ‘మీరు మంత్రిగా ఉన్నపుడు మీకు, మీ సోదరులకు ఎక్కడ  భూములు ఉన్నాయో అక్కడే రోడ్లు వేసింది వాస్తవం కాదా జీవన్ రెడ్డి. విద్యార్థుల సదుపాయాల కన్నా మీ భూముల విలువ పెంచడానికి మారుమూల ప్రాంతమైన నాచుపల్లి వద్ద  జేఎన్‌టీయూ కాలేజీ  నిర్మించింది వాస్తవం కాదా?.

నుకపల్లి హోసింగ్ బోర్డులో భూమి రేట్లు పెంచి మీ తమ్ముడి పేరుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎక్కువ డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా ?. 2009లో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో హైదరాబాద్ బొల్లారంలోని  933 గజాలు 15 లక్షల విలువ గల భూమి ఉందని పేర్కొన్న మీరు,  2014ఎన్నికల్లో  8000 గజాల భూమికి 20 లక్షలుగా పేర్కొనడం ఎలా సమర్థించుకుంటారు. మీరు అఫిడవిట్లో  పేర్కొన్నట్లు 2009 లో తప్పా, లేదా 2014 ఇచ్చినది తప్పా  జీవన్ రెడ్డి చెప్పాలి. దీనిపై నేను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా. నేను సవాలు విసురుతున్న మీరు ఇద్దరు జగిత్యాల బిడ్డలైతే  నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.’

మరిన్ని వార్తలు