‘రాహుల్‌ రుడాలీగా పేరు మార్చుకోవాలి’

26 Jan, 2017 04:50 IST|Sakshi
‘రాహుల్‌ రుడాలీగా పేరు మార్చుకోవాలి’

కవితపై రైల్‌రోకో కేసు కొట్టివేత

హైదరాబాద్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన పేరును రుడాలీ(అద్దెకు ఏడ్చే తెగ) గాంధీగా పేరు మార్చుకోవాలని ఎంపీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. యువనాయకుడు ప్రజల్లో స్ఫూర్తి నింపాలి తప్ప, ఎంతసేపూ వ్యతిరేక వైఖరి అవలంభిచ డమేంటని ప్రశ్నించారు. శుభమా అని ఓయూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే శోకాలు పెట్టడానికి కాంగ్రెస్‌వాళ్లు రాహుల్‌ గాంధీని తీసుకొస్తారా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని అన్నారు. 2011 అక్టోబర్‌ 15 నాటి రైల్‌రోకో కేసు విచారణలో భాగంగా బుధవారం సికింద్రాబాద్‌ న్యూబోయిగూడలోని రైల్వే కోర్టుకు ఆమె హాజరయ్యారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ కేసును కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కోర్టు బయట మాట్లాడుతూ.. కోర్టు కేసు నుంచి విముక్తి కలిగించినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే గొప్ప ఉద్యమాలు నడిపి.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముం దుకు సాగుతున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని రెండు పచ్చపార్టీలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. మతపరమైన రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందని, టీఆర్‌ఎస్‌ ఏనాడూ ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు