విజయ సారధి

13 Dec, 2018 09:03 IST|Sakshi
నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత

అభ్యర్థులకు అండగా నిలిచిన ఎంపీ కవిత

పరిస్థితులను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును

సామాజిక వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు 

అసమ్మతి నేతలను ఏకతాటిపైకి తెచ్చిన వైనం

జిల్లాలో టీఆర్‌ఎస్‌ విజయంలో కీలక భూమిక

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయ సాధనలో ఎంపీ కవిత కీలక పాత్ర పోషించారు. రోడ్‌ షోలు, ప్రచార సభల్లో విస్తృతంగా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రస్తావిస్తూ ఓటు బ్యాంకును భద్రపరిచారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల గెలుపునకు బాటలు వేశారు. అసమ్మతి గళం వినిపించిన పార్టీ నేతలనూ అభ్యర్థుల వెంట నడిచేలా చేయగలిగారు. ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూ, పావులు కదుపుతూ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చారు. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఘన విజయం వెనుక నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక భూమిక పోషించారు. ప్రచార సభలు.. రోడ్‌షోలు.. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున నిత్యం విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎంపీ., ఎన్నికల వేళ అభ్యర్థులకు వెన్నంటే ఉన్నారు. రోజురోజుకూ మారిన పరిణామాలను అంచనా వేస్తూ.. వ్యూహాలకు పదును పెట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం పరిధిలోని నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ వంటి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఆర్మూర్, నిజామాబాద్‌రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. సామాజికవర్గాలు టీఆర్‌ఎస్‌కు బాసటగా నిలిచేలా.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కులసంఘాలు ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఆయా సామాజికవర్గాల మద్దతును కూడగట్టడం ద్వారా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు కవిత మార్గం సుగ మం చేశారు. ప్రభావం చూపే కుల సంఘా ల నేతలతో చర్చించి.. ఆయా వర్గాలు జిల్లాలో టీఆర్‌ఎస్‌కు బాసటగా నిలిచేలా చేశారు. పోలింగ్‌కు నెల రోజుల ముందు నుంచి ఆయా నియోజవర్గాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఆమె పాల్గొన్నారు.
 
లుకలుకలున్న చోట్ల సమన్వయం.. 
ఏ పార్టీలోనైనా నేతల మధ్య లుకలుకలుండటం సాధారణం. ఎన్నికల వేళ ఇవి చిరాకు తెప్పిస్తుంటాయి. కానీ పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేయడంలో కవిత సఫలీకృతమయ్యారు. నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌లోని ముఖ్యనేతల్లో కొంత అసంతృప్తి కనిపించింది. ముందస్తు ఎన్నికల ప్రకటనకు రెండు, మూడు నెలల ముందు నిజామాబాద్‌ అర్బన్‌లోని కొందరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి గళాన్ని వినిపించారు. ఇలాంటి అసమ్మతి నేతలంతా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల వెంట నడిచేలా చేయడంలో కవిత కీలక పాత్ర పోషించారు. నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలిగారు. 

పట్టున్న నేతల చేరికలతో.. 
ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపునకు బాటలు వేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో ఎంఐఎం నేత మీర్‌ మజాజ్‌ అలీ, బోధన్‌లోనూ సామాజిక పోరాట సమితి నాయకులు ఉప్పు సంతోష్, ఆర్మూర్‌ కాం గ్రెస్‌ టికెట్‌ ఆశించిన రాజారాం యాదవ్‌ వంటి నాయకులు ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం పావు లు కదుపుతూ టీఆర్‌ఎస్‌ పార్టీని విజయతీరానికి చేర్చారు.
 

మరిన్ని వార్తలు