పనిలో పనిగా..

26 Oct, 2018 17:46 IST|Sakshi
ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, గుత్తా సుఖేందర్‌రెడ్

పార్లమెంట్‌ సభ్యుల సొంత ప్రచారం

సాక్షిప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల ప్రక్రియ సాంతం డిసెంబర్‌ 13వ తేదీతో ముగియనుంది. ఇక, ఆ తర్వాత జరగాల్సింది లోక్‌సభ ఎన్నికలే. అంటే శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే రెండు నెలల తేడా కూడా లేకుండా ఒక విధంగా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. దీంతో ప్రస్తుతం ఎలాగూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం ద్వారా పూర్తిగా వారితో మమేకం అయినట్లు ఉంటుందన్న అభిప్రాయంతో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను ఎంపీలకు అప్పజెప్పిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

స్టార్‌ క్యాంపెయినర్లుగా .. ఎంపీలు
మరో వైపు ఎంపీలను స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారని చెబుతున్నారు. దీంతో వీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా.. ఆ ఖర్చు అభ్యర్థి ఖాతాలోకి వెళ్లదు. పార్టీ ఖాతాలోనే వీరి ఖర్చులు జమవుతాయి. ఈ సానుకూల అంశాన్ని పరిగణనలోకి తీసుకుని కూడా టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఎంపీలను ప్రచార రంగంలోకి దించుతున్నారని చెబుతున్నారు. ఒకవైపు పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తూనే.. తమ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లను చుట్టి వచ్చే అవకాశం ఉండడంతో ఎంపీలు కూడా ఖుషీగానే ఉన్నారని అంటున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి లోక్‌సభ సభ్యులు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారని ఉదహరిస్తున్నారు. అంతే కాకుండా.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారని, ఆయన ఆయా స్థానాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్‌ ప్రచారానికి వెళతారో, ఆ ప్రాంత ఎంపీ ఆయన వెంట ప్రచారంలో కూడా ఉంటారని సమాచారం.

ప్రత్యేక బాధ్యతలు
ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంపీలు ప్రచారంలో పాలొ ్గనే అవకాశం ఉన్నా, ప్రత్యేకంగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యలను పార్టీ అధిష్టానం అప్పజెప్పిందని చెబుతున్నారు. తమకు బాధ్యతలు అప్పజెప్పిన నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూనే.. అవకాశం చిక్కినప్పుడల్లా ఇతర నియోజకవర్గాలకూ ప్రచారానికి వెళతారని సమాచారం. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు తీసుకున్నారని సమాచారం. అదే మాదిరిగా భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యతలు తీసుకున్నారని చెబుతున్నారు.

అయితే, ఈ నియోజకవర్గాలకే  పరిమితం కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ వీలును బట్టి ప్రచారం చేస్తారని చెబుతున్నారు. దీనివల్ల లోక్‌సభ ఎన్నికలకు దాదాపు అరు నెలల ముందు నుంచే ఓటర్లతో టచ్‌లోకి వెళ్లినట్లు అవుతుందని, క్షేత్రస్థాయిలో పరిస్థితి కూడా అర్థమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనివల్ల లోక్‌సభ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.   

నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రచార బాధ్యతలు నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలు
భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ప్రచార బాధ్యతలు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు

మరిన్ని వార్తలు