ఆత్మరక్షణలో..!

29 Feb, 2016 03:08 IST|Sakshi
ఆత్మరక్షణలో..!

టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్
 
రాజకీయ వలసలపై హోరెత్తుతున్న ప్రచారం
ఎమ్మెల్యేల పార్టీ మార్పిడిపై ఊహాగానాల జోరు
సంకట పరిస్థితుల్లో పలువురు ముఖ్యనేతలు
ఎవరికి వారే చేరేదిలేదంటూ ప్రకటనలు
అనుచరులతో సమాలోచనల ఆంతర్యమేమిటో?
 

 ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  రోజుకొకరు ఇస్తున్న ప్రకటనలు.. వీటిని చూస్తుంటే..రాజకీయ వలసలను ప్రోత్సహించే లక్ష్యంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న  ఆపరేషన్ ఆకర్ష్ జిల్లాలోని పలు విపక్ష పార్టీల నేతలను ఆత్మరక్షణలోకి పడేసినట్లు తెలుస్తోంది. ఆలు లేదు.... చూలు లేదు కొడుకు పేరు.. అన్న చందంగా ప్రతినిత్యం ఫలానా పార్టీ నుంచి ఫలానా ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం.. సోషల్ మీడియాలో చేస్తున్న హల్‌చల్.. ఆయా పార్టీల నేతలకు, శాసనసభ్యులను అసహనానికి గురిచేస్తోంది. అయితే కొందరు ఇతర పార్టీల ముఖ్యనేతలు మాత్రం అదును చూసుకొని అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు తమవంతు ప్రయత్నాలను చాపకింద నీరులా చేస్తున్నారన్న ప్రచారం హోరెత్తుతోంది.

రాష్ర్ట ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో జిల్లాస్థాయి నేతలు, పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీ నుంచి గెలిచిన నారాయణపేట శాసనసభ్యుడు రాజేందర్‌రెడ్డి మినహా ఆయా పార్టీల శాసనసభ్యులెవరూ అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరలేదు. అయితే అనూహ్యంగా రాజేందర్‌రెడ్డి గత నెలలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో జిల్లాలో శాసనసభ్యుల నుంచి సైతం అధికార పార్టీలోకి వలసలు వెల్లువెత్తే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.


 సమాలోచనలు చేస్తున్నారని ప్రచారం..
కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఐదుగురు శాసనసభ్యులు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. వీరిలో అనేకమంది టీఆర్‌ఎస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికే సమాలోచనలు సైతం జరుగుతున్నాయని పెద్దఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం నెలకొంది. అయితే ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పలువురు తీవ్ర అసహనం వ్యక్తంచేయడమే కాకుండా ఖండించాల్సిన పరిస్థితి నెలకొంది. మా పార్టీనుంచి ఎవరూ చేరడదం లేదని మాజీ మంత్రి డీకే అరుణ ఇప్పటికే ఖండించారు. కేవలం ఇతర పార్టీల్లో ఉన్న కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడానికే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.


అదే పార్టీ నుంచి తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కూచకుళ్ల దామోదర్‌రెడ్డి సైతం పార్టీ మారనున్నారన్న ప్రచారం హోరెత్తింది. దీనిపై స్వయంగా దామోదర్‌రెడ్డే జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ తాను పార్టీ మారే అవకాశమే లేదని ఈ ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సొంత పార్టీ కార్యకర్తలకు సూచించారు.కల్వకుర్తి శాసనసభ్యుడు వంశీ చంద్‌రెడ్డిపై సైతం ఇదే తరహా ప్రచారం జరగ్గా ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. కల్వకుర్తిలో విలేకరుల సమావేశం పెట్టి ఊహాజనిత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వొద్దని తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడబోనని స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ఇంత స్పష్టంగా ఆయా నేతలు సందర్భానుసారంగా పార్టీలు మారే అవకాశం లేదని చెబుతున్నా రాజకీయ వర్గాల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి శాసనసభ్యుల వలస జరగడం ఖాయమన్న ప్రచారం హోరెత్తుతూనే ఉంది.
 
అలంపూర్ శాసనసభ్యుడు సంపత్‌కుమార్‌పై సైతం పార్టీ మారుతారన్న ప్రచారం ప్రారంభమైంది. ఆయన తన నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో సైతం సమావేశమయ్యారని, సమయోచితంగా నిర్ణయం తీసుకుంటారంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్‌లోని దిగువస్థాయి కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తోంది.
 
 
కాంగ్రెస్‌ను వీడను
కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మడం ఎంటీ- ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్

 విలువలకే ప్రాధాన్యం
 ‘‘నాకు రాజకీయాలు కావాలా..విలువలు కావాలా అంటే.. విలువలకే ప్రాధాన్యమిస్తా. కాంగ్రెస్‌ను వీడేది లేదు. - కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి

 పార్టీ మారాల్సిన అవసరం లేదు
 సోషల్ మీడియాలోకావాలనే హల్‌చల్
 చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనుంచి మారాల్సిన అవసరం నాకు లేదు.  - గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ
 
 

మరిన్ని వార్తలు