టీఆర్‌ఎస్ విజయోత్సవంలో ఘర్షణ

20 May, 2016 01:37 IST|Sakshi
టీఆర్‌ఎస్ విజయోత్సవంలో ఘర్షణ

పోచారంలో ఉద్రిక్తత
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం ఫలితాలు వెలువడిన అనంత రం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా అదే పార్టీకి చెందిన ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఓ వ్యక్తి కత్తితో దాడికి దిగగా ఎంపీపీ సహా ఇరువర్గాలకు చెందిన 11 మందికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు 144 సెక్షన్ విధించారు.

పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెంది న మరో నాయకుడు రామసహాయం బాల కృష్ణారెడ్డి వర్గీయులు వేర్వేరుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎంపీపీ ఇంటి సమీపంలోకి రాగానే ఇరువర్గాలు తారసపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తి ఎంపీపీ వర్గీయుల మీదకు రాయి విసిరాడు. వెంటనే ఎంపీపీ వర్గీయులు బాలకృష్ణారెడ్డి వర్గీయులపై రాళ్లు విసిరారు. దీంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడగా, కొప్పుల గణేశ్, పుట్ట వెంకన్న అనే ఇద్దరికి గాయాలయ్యాయి. ఎంపీపీ వెంకటరెడ్డితోపాటు మరికొందరు గాయపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన వారిని  ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా... ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న పోచారం గ్రామానికి చెందిన రెడ్డిమళ్ల తులిశమ్మ, రాగం మహేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు