ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత

17 Jan, 2019 03:09 IST|Sakshi

రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిల సభ్యత్వం రద్దు

టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినందుకే...

మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ నిర్ణయం

ఉత్తర్వులు జారీ... వెంటనే వర్తింపు

ఏడుకు పెరిగిన ఎమ్మెల్సీ ఖాళీల సంఖ్య

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికై అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి ఫిరాయిం చిన ముగ్గురు శానసమండలి సభ్యులపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల నిబంధనల ప్రకారం ఎస్‌. రాములు నాయక్, ఆర్‌. భూపతిరెడ్డి, కె. యాదవరెడ్డిలను మండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్‌ అనర్హులుగా ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హత ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ అయిన రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డి, నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ ఫిరాయింపుల నిబంధనల ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలంటూ మండలి చైర్మన్‌కు టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆ ముగ్గురికీ నోటీసులు జారీ చేసిన చైర్మన్‌... దశలవారీగా విచారణ జరిపారు. జనవరి 12న ముగ్గురి అనర్హత పిటిషన్‌పై విచారణ పూర్తి చేశారు. అన్నింటినీ పరిశీలించి బుధవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనమండలిలోని ఖాళీల సంఖ్య ఏడుకు చేరింది.

16 స్థానాలకు ఎన్నికలు...
తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. ఒకేసారి 16 స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో పదవికి రాజీనామా చేశారు. ఇలా నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. తాజాగా అనర్హత వేటుతో మరో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. శాసనమండలి శాశ్వతసభ. ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడింట రెండో వంతు స్థానాలకు పదవీకాలం పూర్తవుతుంది. ఈ లెక్కన మార్చి ఆఖరు వరకు 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న హోంమంత్రి మహమూద్‌ అలీ(టీఆర్‌ఎస్‌), మహమ్మద్‌ సలీం (టీఆర్‌ఎస్‌), టి. సంతోష్‌ కుమార్‌ (టీఆర్‌ఎస్‌), మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ (కాంగ్రెస్‌), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్‌), హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎం. ఎస్‌. ప్రభాకర్‌రావు (టీఆర్‌ఎస్‌), కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కె. స్వామిగౌడ్‌ (టీఆర్‌ఎస్‌), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పూల రవీందర్‌ (స్వతంత్ర) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగుస్తోంది. దీంతో ఏకంగా 16 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకేసారి ఇన్ని స్థానాలు ఖాళీ అవుతుండటంతో టీఆర్‌ఎస్‌లోని ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన పలువురికి సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వనున్నారు. గతంలో ఎమ్మెల్సీ పదవి హామీ పొందిన వారికి ఈసారి అవకాశం రానుంది. 

మరిన్ని వార్తలు