ఇక నామినేషన్లు..

12 Nov, 2018 20:42 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అందిన బీ ఫారాలు

14న నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు

 ఇంకా ఖరారు కాని  కూటమి అభ్యర్థులు

 సాక్షి,నిజామాబాద్‌: ఇప్పటిదాకా ప్రచారంలో బిజీగా గడిపిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇక నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదివారం హైదరాబాద్‌లో ఆ పార్టీ బీ ఫారాలు అందజేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందే టికెట్లు ఖరారు చేయడంతో అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు. ప్రచార కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఆదివారం మధ్యాహ్నం రాజధానిలోని తెలంగాణ భవన్‌కు తరలివెళ్లారు. మరో వైపు నేడు (సోమవారం) అధికార యంత్రాంగం నోటిఫికేషన్‌ జారీతో పాటు నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.

నోటిఫికేషన్‌కు ఒకరోజు ముందే బీ ఫారాలు అందుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కీలక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్లకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఈ నెల 14న నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నామినేషన్‌ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి నియోజకవర్గంలో సత్తా చాటాలని భావిస్తున్నారు. భారీ ర్యాలీ లు, పెద్ద ఎత్తున జన సమీకరణ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించాలనే యోచనలో ఉన్నారు.

తేలని కూటమి అభ్యర్థిత్వాలు..

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నప్పటికీ, మహాకూటమి అభ్యర్థులెవరో తేలకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో టెన్షన్‌ పెరిగి పోతోంది. ఆయా స్థానాలకు ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండటంతో వారి అనుచరుల్లో అ యోమయం నెలకొంది. కూటమి పార్టీల పొ త్తులో భాగంగా టీడీపీ, టీజేఎస్‌లకు ఉమ్మడి జిల్లాలో ఏదైనా స్థానాన్ని కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇప్పటికే రెండు విడత ల్లో నియోజకవర్గాన్ని చుట్టి రాగా, కూటమి అభ్యర్థులు ఇంకా తేలకపోవడతో ఆ పార్టీల శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నాయి. సోమవారం సాయం త్రం గానీ, మంగళవారం గానీ అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

అధినేత దిశానిర్దేశం..

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. నామినేషన్లలో కొత్త నిబంధనలు అమలు చేస్తుండటంతో నామినేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ప్రచార వ్యూహాలపై చర్చించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. 

మరిన్ని వార్తలు