మళ్లీ వారేనా!

16 Apr, 2015 02:00 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్ : అధికార పార్టీ సంస్థాగత ఎన్నికల కీలక ప్రక్రియ దగ్గరపడింది. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) జిల్లా కమిటీ ఎన్నిక గురువారం జరగనుంది. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి జిల్లా కమిటీ ఎన్నిక కావడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు,తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

పరిమిత సంఖ్యలో ఉండే జిల్లా కమిటీలో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారా? కొత్తగా పార్టీలోకి చేరిన వారికి పెద్దపీట వేస్తారా? అనేది కొత్త కమిటీ ఏర్పాటుతో స్పష్టం కానుంది. సాధారణ ఎన్నికల ముందు వరకు సంస్థాగతంగా పటిష్టంగా లేని టీఆర్‌ఎస్, తాజా సంస్థాగత ఎన్నికలతో ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలనే

ప్రయత్నంలో ఉంది. గ్రామ, మండల స్థాయిలో నాయకుల పోటీ వల్ల ఇది పెద్దగా సఫలం కాలేదు.
ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు సూచించిన వారికే పార్టీ పదవులు దక్కాయి. కొన్నిచోట్ల రెండు కమిటీలు ప్రకటించుకున్న పరిస్థితి ఉంది. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లా కమిటీ ఎన్నిక సమావేశం జరగనుంది. విద్యుత్ శాఖ మం త్రి జి.జగదీశ్వరరెడ్డి ఎన్నికల పరిశీలకుడిగా వస్తున్నారు.

రెండు కమిటీలు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వరంగల్ జిల్లా కమిటీ, గ్రేటర్ వరంగల్ కమిటీల్లో పెద్దగా మార్పులు ఉం డబోవని తెలుస్తోంది. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్‌రావు, గ్రేటర్ అధ్యక్షుడిగా నన్నపునేని నరేం దర్ కొనసాగుతారని అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో సా మాజిక సమీకరణల్లో మార్పులు ఉంటే తప్ప.. కార్యవర్గాలు పాతవే ఉంటాయని గులాబీ వర్గాలు చెబుతున్నా యి. రెండు కమిటీల్లో ఏ ఒక్కరు మారినా ఇద్దరు మారుతారని అంటున్నారు.

టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా కమిటీలో 33 మంది చొప్పున ఉంటారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు కార్యదర్శులు, ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు ప్రచార కా ర్యదర్శులు, ఒక కార్యాలయ కార్యదర్శి, ఒక కోశాధికారి, 17 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు.

జిల్లా కమిటీ, గ్రేటర్ వరంగల్ కమిటీలో కూడా ఇంతే సంఖ్యలో నాయకులకు చోటు కల్పిస్తారు. రెండు కమిటీలకు పార్టీ అనుబంధ సంఘాలు ఉంటాయి. రెండు కమిటీల్లో నూ ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే లు ప్రతిపాదించే వారినే తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనలతో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వ ఆదేశాల ప్రకారమే జిల్లా కమిటీలు ఉండనున్నాయి.

అందరి దృష్టి అటే..
టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పార్టీలోని కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నాయకులకు ఇబ్బందికరంగా మారుతోంది. దశాబ్దంన్నరగా టీఆర్‌ఎస్‌లో పని చేస్తున్న వారు ఇప్పుడు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఇలాంటి వారు ఎక్కువగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరపడుతున్నా జిల్లా స్థాయిలో ఎవరికీ అవకాశాలు రాలేదు. ఎక్కువ మంది నాయకులు ఉండడంతో ఈ విషయంలో పోటీ నెలకొంది.

అయినా ఎవరికివారు అధికార పదవుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుత జిల్లా కమిటీలో చోటు కోసం ప్రయత్నిస్తే.. నామినేటెడ్ పోస్టుల్లో కోత పడుతుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పార్టీ పదవి తీసుకుంటే భవిష్యత్తులో అధికార పదవికి రాదేమోనని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం.. ముందుగా పార్టీ పదవిలో ఉంటేనే అధికార పదవి తెచ్చుకునేందుకు మార్గం ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు