జిల్లా కమిటీలపై కసరత్తు

13 Oct, 2019 08:39 IST|Sakshi
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం

క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతంపై దృష్టి

గ్రామ స్థాయి నుంచి  పార్టీ కమిటీలపై కసరత్తు

   

శాసనసభ, లోక్‌సభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జిల్లాలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయించిన విషయం తెలిసిందే. జిల్లాలో గ్రామ, మండల కమిటీల ఏర్పాటును ముమ్మరం చేసింది. అన్ని గ్రామాల్లో పదిహేను మందితో కూడిన గ్రామ కమిటీలను ప్రకటించారు. పలు చోట్ల మండల కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. అన్ని మండలాల్లో కమిటీల ఏర్పాటు పూర్తికాగానే జిల్లా కమిటీ ఏర్పాటు చేయనున్నారు.  పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర కార్యవర్గంలో ఎవరిని తీసుకోవాలి అనే అంశంపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.

సాక్షి, సిద్దిపేట: పార్టీకి కార్యకర్తలే జీవం. అందుకోసం గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం బలోపేతం చేయాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌ వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్‌ నియోకవర్గాల్లో పోటాపోటీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న 499 గ్రామ పంచాయతీల పరిధిలో పార్టీ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర సభ్యులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల కమిటీలు మొత్తం 15 మందితో కమిటీల నియామకం పూర్తి చేశారు. అదేవిధంగా గ్రామాల్లోని చురుకైనకార్యకర్తలను మండల కమిటీల్లోకి తీసుకుంటూ నియామకం చేపట్టారు. ఇందులో ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్‌ మండల నూతన కార్యవర్గం నియామకం పూర్తి చేశారు. మిగిలిన మండలాల నియామకం పూర్తి చేసినప్పటికి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కార్యకర్తల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు.  గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, మర్కుక్‌ మండలాలా నియామకం దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం. కొండపాక మండలంలో మాత్రం పలువురి మధ్య పోటీ ఉండటంతో ఎవ్వరిని నియమించాలనలో  నియోజకవర్గం ఇన్‌చార్జి, ఇతర నాయకులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ్‌ మండల పార్టీ అధ్యక్షులుగా పలువురు పోటీ పడగా.. పాత అధ్యక్షులకే తిరిగి పట్టకట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హుస్నాబాద్‌ పట్టణ కమిటీ విషయంలో మాత్రం ఇప్పుడేమీ కదిలించకుండా మున్సిపల్‌ ఎన్నికల తర్వాత కమిటీలు వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు చెబుతున్నారు.

జిల్లా కమిటీపైనే అందరి చూపు.. 
పలు కారణాలతో జిల్లా పార్టీ నియామకం నిలిపి వేశారు. ఇప్పుడు తిరిగి జిల్లా పార్టీ కార్యవర్గ నియామకం చేపట్టే అవకాశం ఉందని పార్టీ సమావేశాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి పలువురు ఆశావహులు జిల్లా పార్టీ కార్యవర్గంలో చోటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో పార్టీ నూతన భవన నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం కోసం పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్‌ రాకకోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణంతో కార్యాకలాపాలు అక్కడి నుండే జరుగుతాయని నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ప్రాధాన్యత పెరిగింది. జిల్లా కేంద్రంలో ఉండే నాయకుడికి పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తే అందరికి అందుబాటులో ఉంటారని ముఖ్య నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తమకు అవకాశం ఇవ్వాలని ఇతర ప్రాంతాల నాయకులు కూడా పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి ముందే జిల్లా కమిటీ నియామకం జరుగుతుందా..? లేదా? ఆలస్యం అవుతుందా? అనేది జిల్లాలో చర్చగా మారింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా