మున్సి‘పోరు’లో రె‘బెల్స్‌’!

11 Jan, 2020 11:17 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రె‘బెల్స్‌’ మొదలయ్యాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయకున్నా ఆశావహులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఒక్కోవార్డుకు కనీసం ముగ్గురు నుంచి ఆరుగురి వరకు నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇంటిపోరును తప్పించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రెబల్స్‌ విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించినప్పటికీ, వీరిలో ఎంతమంది తప్పుకుంటారోనన్నది ఆసక్తిగా మారింది. సొంత పార్టీనుంచి బరిలో నిలిచిన వారిని బుజ్జగించి, తమ అభ్యర్థుల గెలుపుకోసం వారిని పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ ఎమ్మెల్యేలపై పడింది. దీంతో నిన్నటివరకు కొనసాగిన నామినేషన్ల అంకానికి తెరపడి, ఇక బుజ్జగింపుల పర్వం మొదలుకానుంది.

బీ ఫారాలపైనే ఉత్కంఠ..
టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎన్నికల్లో పోటీచేయాలనుకునే ఆశావహుల లిస్టు భారీగా ఉండగా,  వీరిలో చాలామంది ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు నుంచి ఆరుగురు వరకు ఆపార్టీ వారే పోటీలో ఉన్నారు. మిగతా కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఒకరిద్దరు మాత్రమే బరిలో ఉంటున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్న తిరుగుబాటుదారులతో పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వారిని గెలిపించుకునే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే కావడంతో అసంతృప్తుల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఇందుకోసమే పార్టీ బీ ఫారాలు వెంటనే అందజేయకుండా చివరి వరకు వేచిచూసే ధోరణి అవలంబించే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 14 సాయంత్రం వరకు అవకాశం ఉండటంతో అంతకు కొన్ని క్షణాల ముందే తమ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు. దీంతో అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు తక్కువ సమయం ఉండనుంది. బీ ఫారాలు అందిన తర్వాత అభ్యర్థి పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులతో ప్రచారం నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది.

అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే తీరు..
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనే అధిక సంఖ్యలో రెబల్స్‌గా నామినేషన్‌ వేశారు. ఈ సారి ఎన్నికల్లో రెబల్స్‌ వల్ల నష్టాన్ని తగ్గించుకునేందుకు వారిపై కఠినంగా వ్యవహరించాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. బరిలో ఉన్న సొంత పార్టీ నేతలు పార్టీ జెండా, గుర్తులు వాడుకోకుండా వేటు వేయాలని ఆదేశించారు. అయితే ఇవన్నీ లెక్కచేయకుండా నామినేషన్లకు చివరిరోజైన శుక్రవారం ఒక్క జగిత్యాల మున్సిపాలిటీలోనే 191 మంది టీఆర్‌ఎస్‌ నేతలు నామినేషన్లు వేశారు.

జగిత్యాలలో 2,5,6,14,21,37,48 వార్డుల్లో ఆరుగురి నుంచి ఎనిమిది మంది వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నామినేషన్లు వేశారు.  మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్‌ మున్సిపాలిటీల్లోనూ ఒక్కో వార్డులో ముగ్గురికి మించి టీఆర్‌ఎస్‌ నేతలు బరిలో నిలిచారు. ధర్మపురి మున్సిపాలిటీలో రెబెల్స్‌ బెడద కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని వార్డుల్లో సొంత పోటీ ఎక్కువగానే ఉంది. వీరిలో ఎంతమంది పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేల బుజ్జగింపులకు తలొగ్గి ఉపసంహరించుకుంటారోన్నది ఆసక్తిగా మారింది.

సమన్వయం సాధించేనా.. 
నామినేషన్లు ముగియడంతో శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఆదివారం అభ్యంతరాలు స్వీకరణ అనంతరం ఈనెల 13న అభ్యంతరాలపై అప్పీల్‌కు అవకాశం ఇస్తారు. ఈనెల 14 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం ఉండగా.. ఈలోపు రెబల్స్‌ తమ నామినేషన్లు వెనక్కు తీసుకునేలా ఎమ్మెల్యేలు బుజ్జగింపులకు దిగుతున్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్‌ జగిత్యాల, రాయికల్‌ మున్సిపాలిటీలు, ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌రావు కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఎత్తుకున్నారు. నామినేషన్ల అంకం ముగియడంతోనే బరిలో ఉన్న సొంత పార్టీ నేతలను గుర్తించి పార్టీ పదవులు, కార్పొరేషన్‌ పదవుల ఆశతో బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.  

మరిన్ని వార్తలు