కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సంచలన ఆరోపణలు

10 Dec, 2018 17:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందే రాజకీయాలు వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలను లాగేసే ప్రయత్నాలు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రారంభించిందని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక వేళ హంగ్‌ వస్తే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వాలని తమ ఎమ్మెల్యేలకు ఫోన్‌లు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోందని ఆపద్ధర్మ మంత్రి లక్ష్మా రెడ్డి అన్నారు. కూటమి ఏర్పాటుతో నీచ రాజకీయాలకు పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇపుడు ప్రలోభాలకు తెరలేపిందని మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెరి సగం సీట్లు వస్తున్నాయంటూ తమకు ప్రభుత్వ ఏర్పాటులో సహకరించాలంటూ ఓ కాంగ్రెస్ నేత టీఆర్‌ఎస్‌ నాగర్ కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ఫోన్ చేశారని ధ్వజమెత్తారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో వస్తోందని, ఇలాంటి ప్రలోభాలను కాంగ్రెస్ వెంటనే ఆపాలని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. తనకు ఇటీవలే టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి కాంగ్రెస్‌లోకి రమ్మని ప్రలోభ పెట్టారని మర్రి జనార్దన్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని విశ్వేశ్వర్‌ రెడ్డి అభ్యర్థించారన్నారు. తాము కేసీఆర్ సైన్యంలో ఉన్నామని, 80 నుంచి 90 సీట్లు వస్తాయని, ఇలాంటి నీచమైన ప్రలోభాలు మంచివి కావని విశ్వేశ్వర్ రెడ్డి తో చెప్పానని పేర్కొన్నారు. రెండు సార్లు ఫోన్ చేసినా అదే చెప్పానన్నారు. చంద్రబాబు దర్శకత్వంలో ఇదంతా జరుగుతోందని, కేసీఆర్ సీఎం కావాలని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్‌ను ఎవ్వరూ వీడే ప్రసక్తి లేదని చెప్పారు. ఇలాంటి వెకిలి చేష్టలు కాంగ్రెస్ మానుకోవాలని హెచ్చరించారు.

ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి జూనియర్ రేవంత్ రెడ్డిగా మారారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ నేతలు నిప్పు లాంటోళ్లు తమ వాళ్లని కాంగ్రెస్ నేతలు టచ్ చేస్తే చేతులు కాలిపోతాయన్నారు. టీఆర్‌ఎస్‌ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్‌ సునామీలో కూటమి నేతలు కొట్టుకు పోవడం ఖాయమని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తే తెలంగాణ సమాజం ఒప్పుకోదన్నారు. లగడపాటి, చంద్రబాబుల ప్రలోభాలకు తెలంగాణ లొంగదని మండిపడ్డారు. విలువల గురించి మాట్లాడే విశ్వేశ్వర్ రెడ్డి ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతారా అని ధ్వజమెత్తారు. 85 నుంచి 95 సీట్లు టీఆర్‌ఎస్‌ గెలవబోతోందన్నారు. రేపు మధ్యాహ్నం కల్లా టీఆర్‌ఎస్‌ ప్రభంజనం తెలిసి పోతుందన్నారు.

మరిన్ని వార్తలు