టీఆర్‌ఎస్‌ ‘సహకార’ శిబిరాలు

27 Feb, 2020 02:26 IST|Sakshi

డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు క్యాంపులకు తరలింపు

బెంగళూరు, గోవాతో పాటు పుణ్యక్షేత్రాలకు టూర్లు

29న చైర్మన్‌ ఎన్నిక.. పేర్లు ఖరారు చేయనున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: పాత ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) మేనేజింగ్‌ కమిటీ ఎన్నికలు ముగియడంతో ఈ నెల 29న జరిగే చైర్మన్‌ ఎన్నికపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. పూర్వపు 9 జిల్లాల పరిధిలోని డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాలకు మంగళవారం నామినేషన్లు స్వీకరించగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌ మినహా ఇతర జిల్లాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ స్థానాలను పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఆశిస్తుండటంతో పదవులకు బహుముఖ పోటీ నెలకొంది.

జిల్లాల వారీగా డైరెక్టర్ల స్థానాలకు పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌.. చైర్మన్‌ పదవులకు కూడా పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతోంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు దాదాపు అందరూ పార్టీ మద్దతుదారులే కావడంతో చైర్మన్‌ పదవులు అన్ని టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరనున్నాయి. జిల్లాల వారీగా చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న నేతల జాబితాను పార్టీ ఎమ్మెల్యేలతో సంబంధిత జిల్లా మంత్రులు చర్చించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆమోదం కోసం పంపించారు. ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుండగా, అదేరోజు ఉదయం జాబితాను ప్రకటించే అవకాశముంది.

క్యాంపులకు తరలిన డైరెక్టర్లు
డీసీసీబీ, డీసీఎంఎస్‌ మేనేజింగ్‌ కమిటీలకు ఎన్నికైన డైరెక్టర్లను మంగళవారం రాత్రి పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. గోవా, బెంగళూరుతో పాటు తిరుపతి తదితర పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం ఈ నెల 29న ఉదయం పూర్వ ఉమ్మడి జిల్లా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. చైర్మన్‌ పదవులకు బహుముఖ పోటీ నెలకొనడంతో వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆశావహుల జాబితాను రూపొందించారు.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హామీ మేరకు తాము సహకార ఎన్నికల బరిలోకి దిగినట్లు కొందరు పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించిన వారినే చైర్మన్లుగా ఎన్నుకునేలా జిల్లాల వారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి చర్చల్లో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ, తుది జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు