కారు.. పెంచెను జోరు

17 Jun, 2018 08:57 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ పార్టీ

సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు వేగం పెంచింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ కార్యకలాపాలపై మరింతగా దృష్టి సారించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కన్నేశారు. తమను గెలిపించే బాధ్యతలను చేపట్టే ద్వితీయ శ్రేణి నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలన్న భావనతో ఉన్న ప్రజాప్రతినిధులు వారిని ఎన్నికలకు కార్యోన్ముఖులను చేసేందుకు సుదీర్ఘ ప్రణాళికలు  రూపొందించుకుంటున్నారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఓటరు చెంతకు చేరేందుకు గల మార్గాలపై ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎంపీతో సహా ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమదైన శైలిలో ఓటర్ల నాడికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేసేందుకు, వారికి పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసేందుకు టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు పూనుకుంటున్నారు. ఇప్పటికే విస్తృత పర్యటనల ద్వారా తమ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామ పంచాయతీని అనేకసార్లు చుట్టివచ్చిన నేతలు..

అక్కడి రాజకీయ పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చారు.  ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల్లో ఇప్పటివరకు నెలకొన్న కొంత రాజకీయ నిస్తేజాన్ని తొలగించేందుకు, వారికి చేరువ కావడానికి గల మార్గాలను ప్రజాప్రతినిధులు అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు విస్తరించి ఉన్న ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలకు దశలవారీగా శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు కార్యకర్తల్లో రాజకీయ ఉత్తేజం కలిగించడానికి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే నేతలకు మరింత బాధ్యతాయుతంగా పనిచేసే రీతిలో శిక్షణా తరగతులు నిర్వహించాలని పలు నియోజకవర్గాల ద్వితీయశ్రేణి నేతలు కోరుతున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు ఉంటుందని, రెండు దశలుగా  తరగతులు నిర్వహించడం వల్ల పార్టీ కార్యకర్తలకు శిక్షణ సులభం అవుతుందని, ఈ అంశంపై దృష్టి సారించాలని ఇప్పటికే పలు నియోజకవర్గాల మండల స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు ఎంపీని కలిసి విన్నవించినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఆత్మీయ సమావేశాలకు ప్రణాళికలు.. 
ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం ఇదే రీతిలో తమ నియోజకవర్గంలో శిక్షణ తరగతులు లేదా ఆత్మీయ సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి.. తాను ఎంపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లా అభివృద్ధికి చేసిన కృషి, మండలాలవారీగా మంజూరు చేసిన నిధులు, వాటి ద్వారా పూర్తయిన అభివృద్ధి పనులు, సీఎం, పీఎం సహాయనిధి ద్వారా తన లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు తోడ్పడిన తీరుతోపాటు తాను చేసిన సేవా కార్యక్రమాలను క్రోడీకరించి కార్యకర్తలకు అర్థమయ్యేలా తద్వారా వాటిని గ్రామస్థాయి ఓటర్లకు వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే ఎంపీ నిధుల వినియోగంలో ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండటం, ఇతర సంక్షేమ పథకాల ద్వారా జిల్లాకు పలు సంక్షేమ కార్యక్రమాలను తెచ్చిన తీరును..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇందువల్ల గ్రామాలవారీగా జరిగిన లబ్ధి వివరాలను గణాంకాలవారీగా కార్యకర్తలకు శిక్షణా తరగతుల్లో అందజేయాలని యోచిస్తు న్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ సైతం కార్యకర్తలకు చేరువయ్యేందుకు ఇప్పటికే తమదైన రీతిలో వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకున్నారు.  ఇక పాలేరు నియోజకవర్గానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఇప్పటికే ఆ నియోజకవర్గ కార్యకర్తలకు మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని భద్రాచలంలో శిక్షణా తరగతులు నిర్వహించిన విషయం విదితమే. ఇక ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. పట్టు పెంచుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. శిక్షణ తరగతులను దశలవారీగా నిర్వహించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటి నిర్వహణపై కొందరు ప్రజాప్రతినిధులకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శిక్షణా తరగతుల రూపంలో కాకుండా కార్యకర్తలకు పార్టీ పరమైన పరిస్థితులు వివరించడంతోపాటు వారి కష్టసుఖాలను తెలుసుకునే రీతిలో పరిమిత సంఖ్యలో ద్వితీయశ్రేణి నేతలను రోజువారీగా కలిసి వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పలువురు ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీ ఎమ్మెల్యేలు లేని మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో శిక్షణా తరగతులు నిర్వహించి.. పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపే దిశగా దృష్టి సారించాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు