టీఆర్‌ఎస్‌లో.. బీ–ఫారాల సందడి

11 Nov, 2018 15:23 IST|Sakshi

నేడు రాజధానిలో అధినేతతో అభ్యర్థుల భేట

ఉమ్మడి జిల్లాలో పది మందికి అందనున్న  బీ–ఫారాలు

నామినేషన్లు వేయడానికి ముహూర్తాలు 

చూసుకుంటున్న అభ్యర్థులు

అధినేత కేసీఆర్‌ సభలపైనా రానున్న స్పష్టత 

సాక్షి,నల్లగొండ: ముందస్తు ఎన్నికలు ఖరారైన రోజే తమ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకరోజు ముందే బీ–ఫారాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 6న ప్రభుత్వం రద్దు కావడం, ఆ వెంటనే ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. రెండు నెలలుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను పది చోట్ల టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా, కోదాడ, హుజూర్‌నగర్‌ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకవైపు విపక్ష కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు ఇంకా టికెట్ల కసరత్తు దగ్గరే ఆగిపోగా.. టీఆర్‌ఎస్‌ మాత్రం తమ అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చే పనిలో పడింది.

ఉమ్మడి జిల్లాలోని పది మంది అభ్యర్థులు ఆదివారం టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఆయన ముందుగానే బీ–ఫారాలు అందిస్తారని చెబుతున్నారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే బీ–ఫారాలు ఇవ్వనుండడంతో, అభ్యర్థులు సైతం నామినేషన్లు వేయడానికి ముహూర్తాలు చూసుకునే పనిలో పడ్డారు. ఇతర పార్టీల వారి కంటే ముందుగానే నామినేషన్లు దాఖలు చేసి మరింతగా ప్రచారంపై దృష్టి పెట్టాలన్న నిర్ణయం మేరకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండు నెలలుగా నియోజకవర్గాల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రచారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్ల దాఖలు తర్వాత రెండో విడత ప్రచారం కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు.

 అధినేతతో ప్రత్యేక భేటీ!

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇప్పటికే ఒకసారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీ–ఫారాలు అందించేందుకంటూ ఏర్పాటు చేస్తున్న రెండో భేటీలో సైతం వివిధ అంశాలను ఆయన సమీక్షిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రెండు నెలలుగా నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభ్యర్థుల ప్రచారం తీరు తెన్నులను తెలుసుకుంటూ, వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అవసరమైన ప్రతి అభ్యర్థితో కేసీఆర్‌ నేరుగా ఫోన్లో మాట్లాడుతూ ప్రచారానికి మార్గదర్శకం వహించారు. గత నెల నాలుగో తేదీన నల్లగొండ పట్టణంలో ఉమ్మడి జిల్లా స్థాయి బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయా స్థానాలకు ప్రచార సామగ్రిని పంపించడంతోపాటు రోజు వారీగా ప్రచార సరళిని పరిశీలించి విశ్లేషిస్తూ అవసరమైన సూచనలు చేశారు.

అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు గడిచిపోవడంతోపాటు, ఎన్నికల్లో అసలైన అంకం మొదలు కావడంతో నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి పోలింగ్‌ వరకు మిగిలిన ఉన్న ఈ కాలంలో అభ్యర్థులు ఏమేం చేయాలన్న అంశాలపై చర్చిం చనున్నారని చెబుతున్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం, ఆ తర్వాత  ఆయా నియోజవకర్గాల్లో  తలెత్తిన అసమ్మతి వ్యవహారాలకు నెల రోజుల్లోపే చెక్‌ పెట్టడంతో మిగిలిన నెల రోజుల కాలంలో అన్ని నియోజకవర్గాల్లో వారు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక, నోటిఫికేషన్‌ విడుదల తర్వాత అమలు చేయాల్సిన వ్యూహంపై చర్చిస్తారని అంటున్నారు.

ప్రచార సభలపై రానున్న స్పష్టత

మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బహిరంగ సభల్లో పార్టీ అధినేత కేసీఆర్‌ పాల్గొంటారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక బహిరంగ సభను నల్లగొండలో నిర్వహించగా కేసీఆర్‌ పాల్గొన్నారు. అక్టోబరు నెలాఖరులో జిల్లాలోని నకిరేకల్, ఆలేరు నియోజకవర్గాల్లో కేసీఆర్‌ బహిరంగ సభలు ఉంటాయని పార్టీ వర్గాలు భావించినా అవి జరగలేదు. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత .. ఆయన జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారని పేర్కొంటున్నారు. దీంతో ఆదివారం నాటి కేసీఆర్‌ సమావేశం తర్వాత ప్రచార సభలు, నిర్వహించే తేదీలపై ఒక స్పష్టత రానుందని అంటున్నారు. అదే మాదిరిగా, ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న కోదాడ, హుజూర్‌నగర్‌లపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరించాయి.

మరిన్ని వార్తలు