కారు.. వన్‌సైడ్‌ వార్‌

26 Jan, 2020 01:51 IST|Sakshi

పురపాలిక ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌

86 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో స్పష్టమైన మెజార్టీ

స్వతంత్రులు, ఎక్స్‌ అఫీషియోలతో కలిసి మరో 16 మున్సిపాలిటీల్లో గెలిచే ఛాన్స్‌

నిజామాబాద్‌ మినహా మిగిలిన కార్పొరేషన్లలోనూ గులాబీ జెండా ఎగిరే అవకాశం

ఎంఐఎంతో కలిసి ప్రయత్నిస్తే నిజామాబాద్‌ పీఠమూ అధికార పార్టీకే వచ్చే పరిస్థితి

7 పురపాలికల్లో కాంగ్రెస్‌ గెలుపు.. రెండు పురపాలికలపై ఎంఐఎం జెండా

రెండు మున్సిపాలిటీలు కమలం ఖాతాలోకి.. నిజామాబాద్‌లో అతిపెద్ద పార్టీగా బీ

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో కారు దుమ్ము రేపింది. పల్లె అయినా, పట్టణమైనా పట్టాభిషేకం మాత్రం టీఆర్‌ఎస్‌కేనని నిరూపితమైంది. శని వారం వెలువడిన మున్సిపల్‌ ఫలితాల్లో అధికార పార్టీ తిరుగులేని విజయం సాధించి సత్తా చాటింది. ముందు నుంచీ ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టుగానే పురపోరులో ఏకంగా సెంచరీ కొట్టేసింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 86 చోట్ల సొంతంగా విజయం సాధించిన గులాబీ పార్టీ.. స్వతంత్రులు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిసి మరో 16 స్థానాలను కైవసం చేసుకోనుంది. దీంతో 100 నుంచి 102 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్‌ పార్టీ ఏడు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోగా.. ఎంఐఎం, బీజేపీలు చెరో రెండు పురపాలికల్లో గెలుపొందాయి. మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది. ఒక్క నిజామాబాద్‌ మినహా మిగిలిన అన్ని కార్పొరేషన్లనూ గులాబీ పార్టీయే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదింటిలో సొంతంగా మెజార్టీ సాధించిన అధికార పార్టీ.. మరో మూడింటిని కూడా దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్‌లో కూడా టీఆర్‌ఎస్‌ అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీట్లు, ఓట్లు.. కారుదే జోరు
ఓట్లపరంగా చూసినా, సీట్లపరంగా చూసినా కారు జోరు కొనసాగింది. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లాగానే ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఘన విజయాన్ని సాధించింది. విపక్షాలు కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో సత్తా చూపిస్తామంటూ కాంగ్రెస్‌.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్న బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. సీట్లపరంగా చూస్తే అటు మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్‌ దాదాపు 60 శాతం స్థానాలు గెలుపొంది తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది. కాంగ్రెస్‌ పార్టీ 20 శాతం స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 8 శాతం స్థానాలను గెలుచుకుంది. గతంతో పోలిస్తే అటు మున్సిపాలిటీల్లోనూ, ఇటు కార్పొరేషన్లలోనూ బీజేపీ బాగా పుంజుకోవడం కమలనాథులకు కాస్త ఊరటనిచ్చే అంశం. కార్పొరేషన్లలో అయితే కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టి బీజేపీ రెండో స్థానానికి ఎగబాకింది. ఇక ఎంఐఎం, ఇతరులు కలిసి 12 శాతం స్థానాలను కైవసం చేసుకున్నారు. ఎంఐఎం చెప్పుకోదగ్గ స్థానాలు సాధించగా.. టీజేఎస్, వామపక్షాలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) కొన్ని వార్డుల్లో విజయం సాధించింది. ఈ పార్టీ గుర్తుపై పోటీ చేసినవారిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెబెల్స్‌కూడా ఉన్నారు. 

23 చోట్ల స్పష్టత లేదు...
మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటినప్పటికీ, కొన్ని చోట్ల అధికార పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. చండూరు, నేరేడుచర్ల, వడ్డేపల్లి, పెద్ద అంబర్‌పేట, తుర్కయాంజల్, ఆదిభట్ల, నారాయణ్‌ఖేడ్‌లలో కాంగ్రెస్‌ గెలుపొందగా.. ఆమనగల్, తక్కుగూడల్లో బీజేపీ.. భైంసా, జల్‌పల్లిలో ఎంఐఎం విజయం సాధించాయి. 23 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇందులో కొంపల్లి, భువనగిరి, నల్లగొండ, భూత్పూరు, మక్తల్, మణికొండ, ఐజ, ఖానాపూర్, నస్‌పూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, సంగారెడ్డి, జనగామ, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, హాలియా, నారాయణ్‌పేట, కోస్గి, అమరచింత, నార్సింగి, కొల్లాపూర్, కల్వకుర్తి ఉన్నాయి. మిగలిన అన్ని పురపాలికల్లో అధికార పార్టీకి మెజార్టీ వచ్చింది. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట, బండ్లగూడ జాగీర్లలో టీఆర్‌ఎస్‌ గెలుపొందగా.. నిజామాబాద్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. రామగుండం, బోడుప్పల్, మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లను స్వతంత్రులు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో టీఆర్‌ఎస్‌ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.

స్పష్టత లేని మున్సిపాలిటీల విషయానికి వస్తే ఖానాపూర్, నస్‌పూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, సంగారెడ్డి, జనగామ, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, హాలియా, నారాయణ్‌పేట, కోస్గి, అమరచింత, నార్సింగి, కొల్లాపూర్, కల్వకుర్తిలలో స్వతంత్రులు, ఎక్స్‌అఫీషియో సభ్యుల బలంతో టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలుండగా.. ఐజలో స్వతంత్రుల మద్దతుతో పీఠం కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. కొంపల్లి, భువనగిరి, నల్లగొండ, భూత్పూర్, మక్తల్, మణికొండ స్థానాల్లో కాంగ్రెస్‌–బీజేపీలు కలిస్తే మేజిక్‌ ఫిగర్‌ దాటనున్నాయి. ఇందులో మక్తల్, భూత్పూర్‌లలో కాంగ్రెస్‌ కన్నా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. మిగిలినచోట్ల ఈ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్‌కు పీఠాలు దక్కే అవకాశముంది. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌ వ్యూహంతో వ్యవహరిస్తే ఇందులోనూ కొన్ని ఆ పార్టీ ఖాతాలో పడతాయి.
 

చదవండి : మున్సి‘పల్స్‌’ : సమగ్ర వివరాలు

మరిన్ని వార్తలు