ఓవర్‌ లోడ్‌ ! 

10 Jun, 2018 08:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : రానున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి స్థానికంగా ఆటుపోట్లు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగారు తెలంగాణ పేరుతో విపక్ష పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకోవడం.. ఇంకా చేరికలు కొనసాగుతుండడంతో ఉమ్మడి పాలమూరు ప్రాంతం లో గులాబీ పార్టీ ‘ఓవర్‌ లోడ్‌’తో సతమతమవుతోంది. వచ్చే ఎన్నికల్లో చట్టసభలకు టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు పెద్దసంఖ్యలో నేతలు క్యూలో ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ కొత్తవారు పోటీకి సై అంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల్లో ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ఎవరికి టికెట్లు దక్కుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

బంగారు తెలంగాణ కోసం... 
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు విపక్ష పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో వచ్చి చేరారు. వీరిలో స్థానిక ప్రజాప్రతినిధులే కాకుండా ఎమ్మె ల్యేలు కూడా ఉన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున గెలిచిన నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డితో పాటు తాజాగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అబ్రహం, ఎడ్మ కిష్టారెడ్డి సైతం కారెక్కారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఆ శావహుల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. 

కల్వకుర్తి బరిలో ఐదుగురు... 
ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎక్కడా లేని విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో తీవ్రమైన పోటీ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి బరిలో నిలిచేందుకు ఇప్పటికే ఐదు మంది ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన జైపాల్‌యాదవ్‌తో పాటు స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని టీఆర్‌ఎస్‌ తరఫున పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. వీరితోపాటు పార్టీకి చెందిన గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్‌ వంటి నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వీరికి తాజాగా మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేసిన ఎడ్మ కిష్టారెడ్డి జత కలిశారు.  ఇలా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్‌ ఆశావహుల జాబితా చేంతాడంతైంది. ఈ మేరకు వీరు నియోజకవర్గంలో తమ పట్టును నిలుపుకునేందుకు ఎవరికి వారు పార్టీలో గ్రూపు లు కడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మె ల్యే బరిలో నిలిచే ఆశావహుల సంఖ్య ఐదుకు చేరడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇది ఇలాగే కొనసాగకుండా అందరు నేతల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ కార్యకలాపాలన్నీ ఒకే తాటిపై కొనసాగేలా చూడకపోతే పార్టీకే నష్టమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  

గద్వాలలోనూ ఇదే పోరు.. 
కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న గద్వాలను ఢీ కొట్టాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే స్థానిక పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, పార్టీకి చెందిన బీసీ కమిషన్‌ సభ్యుడు ఆంజనేయులుగౌడ్, బండ్ల చంద్రారెడ్డి సైతం పోటీలో ఉంటామని చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయి ఎవరికి వారే యము నా తీరు అన్న చందంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్లు ఆశిస్తున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా.. ఎన్నికల సమయం నాటికి పరిస్థితులు ఎలా మారతాయి, ఎవరికి టికెట్‌ దక్కుతుందనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.  

అచ్చంపేటలో నువ్వా–నేనా.. 
సెంటిమెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే అచ్చంపేట నియోజకవర్గంలో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది ఒక సంప్రదాయంగా నెలకొంది. అందుకు అనుగుణంగా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున గువ్వల బాలరాజ్‌ ఎవరు ఊహించని విధంగా బరిలో నిలిచి విజయబావుటా ఎగురవేశారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర స్థాయిలో మెజార్టీ స్థానాలు దక్కించుకుని టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఇదే సెంటిమెంట్‌గా భావించిన ఆయా పార్టీలు ఈ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలని శాయశక్తులా ప్రయత్నిస్తాయి. అయితే ఈసారి టీఆర్‌ఎస్‌ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రాములు సైతం శాసనభ టికెట్‌ పోటీలో ఉంటారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్‌ ఇస్తుందనే విషయంలో అస్పష్టత నెలకొంది. దీంతో ఇక్కడి కార్యకర్తలు సైతం అయోమయానికి గురవుతున్నారు. 

అలంపూర్‌ అబ్రహంకేనా? 
సరిహద్దు నియోజకవర్గమైన అలంపూర్‌లో కాస్త భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మంధా జగన్నాథం కుమారుడు శ్రీనాథ్‌ బరిలో నిలిచారు. పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో మందా జగన్నాథం అలంపూర్‌ నియోజకవర్గంలో అంతా తానై నడిపిస్తున్నారు. కానీ ఇదే నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ ఆశపడుతున్నారు. ఇదే ఆలోచనను పార్టీలోని పలువురు ముఖ్యులతో కూడా పంచుకున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా భాస్కర్‌ దాదాపు ప్రతీరోజూ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో నియోజకవర్గంలోని ఏదో ప్రాంతంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడికే చెందిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అబ్రహం సైతం తాజాగా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అభ్యర్థుల సంఖ్య మూడుకు చేరగా టీఆర్‌ఎస్‌ టికెట్‌ అబ్రహంకే అవకాశం దక్కే చాన్స్‌ ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

మరిన్ని వార్తలు