ఉద్యమ, సామాజిక నేపథ్యాలకు పెద్దపీట 

9 Jun, 2019 02:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జెడ్పీ చైర్‌పర్సన్ల ఎంపికలో కేటీఆర్‌ ప్రత్యేక కసరత్తు

64 జిల్లా పరిషత్‌ పదవుల్లో 40 వెనుకబడిన వర్గాలకే...

17 చైర్‌పర్సన్, 23 వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు

జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాతే ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌.. జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల ఎంపికలో ప్రత్యేక పంథా అనుసరించింది. పదవుల కేటాయింపులో సామాజిక సమతౌల్యం, ఉద్యమ నేపథ్యాలకు పెద్దపీట వేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 32 జిల్లాల్లోని 64 జెడ్పీ అధ్యక్ష, ఉపా«ధ్యక్ష పదవులకు శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 40 పదవులు బడుగు, బలహీనవర్గాలకు దక్కాయి. బీసీలకు 7, ఎస్సీలకు 6, ఎస్టీలకు మరో 4 జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ కేటాయించింది. మొత్తం 17 జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవులను బడుగు బలహీన వర్గాలకు అప్పజెప్పడంతోపాటు మరో 23 జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులను సైతం బలహీన వర్గాలకు చెందిన నాయకులకు కేటాయించింది. 

కేటీఆర్‌ విస్తృత కసరత్తు... 
ఈ మొత్తం ఎంపికలకు సంబంధించి గత మూడు రోజులుగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని దాదాపు అన్ని జిల్లా స్థానాలకు సంబంధించి చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌లకు సంబంధించిన ఎంపికపై ఏకాభిప్రాయం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పలు జిల్లాల మంత్రులు కేటీఆర్‌తో సమావేశమై జెడ్పీ చైర్‌పర్సన్‌లను ఎంపిక చేశారు. ఈసారి సాధ్యమైనంత ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలకు, ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలన్న పార్టీ ఆలోచన మేరకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుందని చర్చల సందర్భంగా కేటీఆర్‌... స్థానిక మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులెవరైనా జెడ్పీటీసీలుగా గెలిచి ఉంటే వారి వివరాలు ఇవ్వాలని మంత్రులకు సూచించారు.

ఈ మేరకు పలు జిల్లాల్లో ఉద్యమ నేపథ్యం కలిగి, పార్టీలో కొనసాగుతున్న పలువురు నాయకులకు జెడ్పీ పదవులు దక్కేలా చర్యలు తీసుకున్నారు. ఉద్యమకారుల కోటాలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవులు పొందిన వారిలో ములుగు జిల్లాకు చెందిన కుసుమ జగదీశ్, నల్లగొండ జిల్లాకు చెందిన బండ నరేందర్‌రెడ్డి, వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ సుధీర్‌ కుమార్, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన రాథోడ్‌ జనార్దన్‌ ఉన్నారు. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థి నాయకుడు సిద్ధం వేణుకు జెడ్పీ వైస్‌ చైర్మన్‌గా అవకాశం దక్కింది. కేవలం జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవుల్లోనే కాకుండా కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక విషయంలోనూ ఇదే సూత్రాన్ని పార్టీ అమలు చేసింది. జిల్లా పరిషత్‌ పదవులకు జరిగిన ఎంపికపై పార్టీ శ్రేణులతోపాటు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో కేటీఆర్‌ చేసిన కసరత్తును టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు